ఇప్పుడు ఎన్నికలు లేవు.. నేను ఓట్ల కోసం రాలేదు: బండి సంజయ్

టీఆర్ఎస్, కాంగ్రెస్‌ నేతలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సఫిల్ గూడలో నిర్వహించిన 'బస్తీ సంపర్క్ అభియాన్' కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు.

Update: 2022-09-18 13:21 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: టీఆర్ఎస్, కాంగ్రెస్‌ నేతలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సఫిల్ గూడలో నిర్వహించిన 'బస్తీ సంపర్క్ అభియాన్' కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్నేళ్లలో ఈ రెండు పార్టీలు ఏనాడూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల వద్దకు వస్తారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఎన్నికలు లేవు.. నేను ఓట్ల కోసం రాలేని కేవలం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పాదయాత్ర చేస్తున్నానని బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం దళితుల కోసం 'బస్తీ సంపర్క్ అభియాన్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. దేశవ్యాప్తంగా 75 వేల ఎస్సీ గ్రామాల్లో ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు. తెలంగాణలో ఈ కార్యక్రమం ద్వారా 5 వేల ఎస్సీ కాలనీలను సందర్శించి, వారి సమస్యలను తెలుసుకొని, వారికి కేంద్రం ఏం చేస్తుందో వివరించబోతున్నామని అన్నారు. నవంబర్ 26 వరకు 'బస్తీ సంపర్క్ అభియాన్' కార్యక్రమం జరగనుందని తెలిపారు. దళితులకు తగిన గుర్తింపు, గౌరవం ఇస్తున్నది కేవలం కేవలం బీజేపీ పార్టీనే అని వెల్లడించారు.

కేంద్రంలో 12 మంది దళిత ఎంపీలను మంత్రులను చేసిన ఘనత బీజేపీదే అని గుర్తుచేశారు. కేసీఆర్ సర్కార్ చేస్తున్న అవినీతిని ప్రజలకు తెలియజెప్పేందుకే పాదయాత్ర చేస్తున్నానని వివరించారు. దళితులకు ఇచ్చిన అనేక హామీలను కేసీఆర్ విస్మరించారని, దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళితులకు రూ.10 లక్షల వరకూ ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి, ప్రతి ఒక్కరి నెత్తిపై లక్షా 20వేల అప్పు పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలానే కొనసాగితే ప్రజలు రోడ్డెక్కి అడుక్కుతినాల్సిన పరిస్థితి వస్తుంది. పేదోళ్లంతా ఒక్కటి కావాలి. ఇంకెన్నాళ్లీ బాంచన్ బతుకులు? మనమంతా అంబేద్కర్ వారసులం తెగించి కొట్లాడదాం రండి అని పిలుపు నిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్ దళిత ద్రోహి. తాను మాత్రం 100 రూంల ఇల్లు కట్టుకున్నాడు. కోట్లు దండుకుంటున్నాడు. టీఆర్ఎస్‌ను తెలంగాణ పొలిమేర దాకా తరిమికొట్టండి. ఇప్పటి వరకు కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ పార్టీలకు అధికారం ఇచ్చారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News