కేటీఆర్‌ను లోపలేసి తొక్కే దమ్ము కేసీఆర్‌కు ఉందా?: బండి సంజయ్

ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కవిత కోసం అంతా రెడీ అవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్లు చేశారు.

Update: 2023-03-16 11:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కవిత కోసం అంతా రెడీ అవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్లు చేశారు. బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తే చాలు బీజేపీ నేతలను అరెస్ట్ చేసి జైల్లో వేస్తున్నారని, తాము ఇలాంటి వాటికి భయపడుతారని సీఎం భావిస్తున్నారని, తమ కోసం ఒక్క జైలు కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లు సిద్ధం చేసుకున్నా తాము భయపడేది లేదని బండి వ్యాఖ్యానించారు. తమకు జైళ్లు కొత్త కావని, తమ నేతలు ప్రజల కోసం పోరాడి ఎన్నిసార్లు జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని పేర్కొన్నారు. చంచల్ గూడ జైల్లో ఉన్న బీజేవైఎం నాయకులను బండి గురువారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సంచలన కామెంట్లు చేశారు. పేపర్ లీకేజీ బాధ్యుడు మంత్రి కేటీఆరేనని ఆయన ఆరోపించారు. టీఎస్ పీఎస్సీ కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతంతా ఐటీ శాఖదేనని, మరి కేటీఆర్‌ను సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేస్తారా అని బండి ప్రశ్నించారు. కేటీఆర్‌ను లోపలేసి తొక్కే దమ్ము కేసీఆర్‌కు ఉందా? అని సంజయ్ ప్రశ్నించారు.

తప్పు ఎవరు చేసినా, చివరకు తన కొడుకైనా, బిడ్డ అయినా ఊరుకునేది లేదని అసెంబ్లీలో చెప్పిన మాటలకు కేసీఆర్ కట్టుబడి కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తారా అని నిలదీశారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో తెలంగాణలోని లక్షలాది యువత తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌తో పాటు కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి జైలుకు పంపడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే లీకేజీ నేరస్తులకు రాచ మర్యాదలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అసలు పేపర్ లీకేజీ ఎట్లా అయ్యిందని, టీఎస్ పీఎస్సీ చైర్మన్‌కు తెలియకుండా ఎలా అవుతుందని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. ముందు వాళ్లను ప్రాసిక్యూట్ చేయాలని, నేరస్తులను కాపాడుకునేందుకే సిట్‌కు అప్పగించారని ఆరోపించారు. మియాపూర్ భూములు, డ్రగ్స్, నయీం కేసులపై వేసిన సిట్‌లు ఏమైందని, కేసీఆర్ సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితి ఏర్పడిందని చురకలంటించారు. కేసీఆర్ ఫ్యామిలీ తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి అభ్యంతరమేంటని బండి ప్రశ్నించాఉ. ఇదంతా కేసీఆర్ కొడుకు ఆడుతున్న డ్రామా అని మండిపడ్డారు. రాజశేఖర్ అనే వ్యక్తి బీజేపీ నాయకుడని అంటున్నారని, 2017 నుంచి అతడు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఉద్యోగి అని, ఇది ఐటీశాఖ పరిధిలో ఉంటుందన్నారు. తప్పు చేసిన వారిని గుర్తించడం చేతకాని మంత్రిగా కేటీఆర్ ఉండి ఏం ప్రయోజనమని, ఆయన మంత్రిగా అనర్హుడని బండి పేర్కొన్నారు. లీకేజీ బాధ్యురాలు రేణుక తల్లి బీఆర్ఎస్ సర్పంచ్ అని, ఆమె అన్న బీఆర్ఎస్ నాయకుడని, ఆ కుటుంబమంతా బీఆర్ఎస్సేనని ఆయన పేర్కొన్నారు.

మరి పేపర్ లీకేజీ ఎవరి కోసం అయ్యిందని బండి ప్రశ్నించారు. బీజేపీపై మొరిగే కుక్కలంతా ఏం సమాధానం చెబుతారని ఘాటుగా స్పందించారు. పరీక్షలు కూడా నిర్వహించలేని చేతగానితనం కేసీఆర్ సర్కార్ ది అని బండి ధ్వజమెత్తారు. బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని, చైర్మన్ ను తొలగించాలని బండి డిమాండ్ చేశారు. ఉస్మానియాలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేయడాన్ని బండి తీవ్రంగా ఖండించారు. బేషరతుగా వారిని విడుదల చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బండి సంజయ్ వెంట పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎస్సీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు ఎస్ కుమార్ ఉన్నారు.

Tags:    

Similar News