BJP: బీజేపీలో ప్రెస్‌మీట్లపై ఆంక్షలు..! అనుమతి తప్పనిసరి అని ఆదేశాలు

కాషాయ పార్టీలో రోజురోజుకూ ముసలం ముదురుతోంది.

Update: 2024-08-26 02:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాషాయ పార్టీలో రోజురోజుకూ ముసలం ముదురుతోంది. రాష్ట్ర నాయకత్వానికి, బీజేఎల్పీ నేతకు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు మధ్య పొసగడం లేదని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులకు తోడు పార్టీ తీసుకున్న కొత్త నిర్ణయాలు నేతలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. రాష్ట్ర నాయకత్వం ప్రెస్ మీట్లపై పలు ఆంక్షలు విధించినట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీ రాష్ట్ర ఆఫీసులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటే పార్టీ అనుమతి తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్టేట్ పార్టీ తీసుకున్న పలు నిర్ణయాలపై సొంత పార్టీ లీడర్ల నుంచే విమర్శలు వస్తున్నాయి.

మీడియా ఇన్‌చార్జికి సబ్జెక్ట్ వివరించాలి!

ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు గెలిచారు. ప్రెస్ మీట్ల అంశంపై రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయంతో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రెస్ మీట్ నిర్వహించేందుకు కూడా వెనుకడగు వేస్తున్నారు. ముందుగానే సబ్జెక్ట్ కూడా మీడియా ఇన్‌చార్జికి వివరించాలనే షరతు విధించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వ్యక్తి కూడా మీడియా ఇన్‌చార్జికి వివరించాల్సిన పరిస్థితి పార్టీలో ఉండటంపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిబంధనల కారణంగా పార్టీ రాష్ట్ర ఆఫీసుకు రావాలేంటే కూడా విముఖత చూపిస్తున్నారు. అందుకే పార్టీ రాష్ట్ర ఆఫీసులో కంటే బయట ప్రెస్ మీట్ నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. లేదంటే ఏదయినా కార్యక్రమం సందర్భంగా మాట్లాడటమో.. లేక తమ సొంత సెగ్మెంట్‌లో ప్రెస్ మీట్లు పెట్టుకోవడం ఉత్తమమనే భావనలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నట్టు తెలుస్తోంది.

కీలక సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎంపీల డుమ్మా

గతంలో ఎమ్మెల్యేగా ఉండి ప్రస్తుతం ఎంపీగా గెలిచిన ఒక నేత ప్రెస్ మీట్ అంశంలో అప్పుడూ.. ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నట్టు చెప్పారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. రాష్ట్ర నాయకత్వం తీసుకున్న పలు నిర్ణయాలతో కీలక సమావేశాలకు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు డుమ్మా కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకుంటున్నారు. ఇటీవల రాష్ట్ర పదాధికారుల సమావేశానికి సైతం ఒకే ఒక్క ఎమ్మెల్యే మినహా మరెవరూ హాజరుకాలేదు. సెగ్మెంట్‌లో పెండింగ్ పనులు ఉన్నాయని పలువురు ఎమ్మెల్యేలు స్కిప్ చేశారు. అయితే పార్టీ రాష్ట్ర ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా హాజరవ్వకపోవడానికి ఇదీ ఒక కారణంగా చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇంకా పునరావృతమవుతూనే ఉన్నాయి. మరి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తుందా? లేక లైట్ తీసుకుంటుందా? అనేది చూడాలి.


Similar News