బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును హవాలా అడ్డాగా మార్చారు.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​​

లిక్కర్​స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పార్టీ కార్యాలయాన్ని మనీలాండరింగ్​ కోసం వాడుకుందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు.

Update: 2023-04-12 14:06 GMT

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: లిక్కర్​స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పార్టీ కార్యాలయాన్ని మనీలాండరింగ్​ కోసం వాడుకుందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. తీహార్​జైల్లో ఉన్న సుఖేశ్​చంద్ర తాజాగా బుధవారం విడుదల చేసిన వీడియో ఛాటింగ్​వివరాలనుబట్టి ఇది స్పష్టమవుతోందని చెప్పారు. సుఖేశ్ చంద్రను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. బషీర్​బాగ్​లోని ఈడీ కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన రఘునందన్​రావు జైలు నుంచి సుఖేశ్​చంద్ర రాసిన ఉత్తరం, విడుదల చేసిన వాట్సాప్​ఛాటింగుకు సంబంధించిన జిరాక్స్​ప్రతులను అధికారులకు అందచేశారు. అనంతరం బయటకొచ్చి మీడియాతో మాట్లాడారు. సుఖేశ్​చంద్ర తాజాగా విడుదల చేసిన వాట్సాప్​ఛాట్​లను చూస్తే అతనికి బీఆర్ఎస్ పార్టీలోని మరికొందరు నాయకులతో కూడా సంబంధాలు ఉన్నట్టుగా స్పష్టమవుతోందని చెప్పారు.

తెలంగాణ భవన్​లో సుఖేశ్​చంద్ర కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా ఛాట్లలో స్పష్టంగా ఉందన్నారు. పదిహేను కోట్ల రూపాయలను తెలంగాణ భవన్​లో ఎమ్మెల్సీ అన్న స్టిక్కర్​అతికించి ఉన్న 6060 నెంబర్​బ్లాక్​రేంజ్​రోవర్​కారులో ఉన్నవారికి అందచేసినట్టు సుఖేశ్​చంద్ర వెల్లడించిన అంశాన్ని ప్రస్తావించారు. ఈ నెంబరు ఉన్న కారు ఎవరిదన్నది తెలంగాణ రాష్ర్ట రవాణా శాఖ అధికారులు, పోలీసులు బయటపెట్టాలని డిమాండ్​చేశారు. కారు ఎవరి పేరు మీద రిజిస్ర్టేషన్​అయి ఉందన్నది వెల్లడించాలన్నారు. తెలంగాణ భవన్​లోపలికి ఈ నెంబరు కారు రాలేదని సీసీ టీవీ ఫుటేజీని బయటపెట్టగలరా? అని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. తాను డబ్బును అరుణ్​పిళ్లైకి ఇచ్చినట్టు సుఖేశ్​చంద్ర చెబుతున్నాని, అయినా అతన్ని కస్టడీలోకి తీసుకుని ఎందుకు విచారించటం లేదని ప్రశ్నించారు.

పార్టీ కార్యాలయాన్ని మనీలాండరింగ్​కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. అందుకే ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలన్నారు. సుకేశ్​చంద్రను కస్టడీకి తీసుకుని నిశితంగా ప్రశ్నించాలన్నారు. సుఖేశ్​చంద్ర విడుదల చేసిన వాట్సాప్​ఛాటింగుల జిరాక్స్​కాపీలను ఈడీ అధికారులకు అందచేసినట్టు తెలిపారు. ఈ సమాచారం మొత్తాన్ని లిక్కర్​స్కాం కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ ఈడీ అధికారులకు అందచేస్తామని చెప్పారన్నారు. అక్కడి నుంచి సూచనలు అందితే తాము కూడా విచారణ జరుపుతామని ఈడీ అధికారులు చెప్పారని వివరించారు.

Also Read..

దేశంలో అత్యధిక కేసులు కలిగిన సీఎం కేసీఆరే! 

Tags:    

Similar News