కాంగ్రెస్ లోకి బీజేపీ ఎమ్మెల్యే!.. ఈటల స్కెచ్ లో భాగమేనా?

Update: 2024-02-21 10:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి నేతల చేరికల అంశం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ కు చెందిన పలువురు కీలక నేతలు ఇప్పటికే హస్తం గూటికి చేరగా తర్వాత ఎవరూ అనేది ఆసక్తి రేపుతున్నది. ఈ క్రమంలో తాజాగా సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి దంపతులు బుధవారం రేవంత్ రెడ్డితో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారింది. దీంతో వీరు త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరడంలో భాగంగానే సీఎంతో భేటీ అయ్యారా అనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈటల స్కెచ్ లో భాగమేనా?

కాగా ఇటీవల రేవంత్ రెడ్డితో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు భేటీ అవుతున్నారు. అనంతరం వారిలో కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్న నేపథ్యంలో పాల్వాయి హరీశ్ బాబు, నర్సింహారెడ్డి దంపతులు సైతం బీజేపీకి గుడ్ బై చెప్పి చేయి అందుకోబోతున్నారా అనే చర్చ తెరపైకి వస్తోంది. అయితే వీరు సీఎంతో భేటీ కావడం వెనుక మాజీ మంత్రి ఈటల స్కెచ్ ఏమైనా ఉందా అనే వాదన తెరపైకి వస్తోంది. ఈటల రాజేందర్ గత కొంత కాలంగా బీజేపీలో అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారని ఈ క్రమంలో కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంత్ రావు, పట్నం మహేందర్ రెడ్డితో ఇటీవల భేటీ అయి చర్చలు సైతం జరిపినట్లు ఓ ఫోటో వైరల్ అయింది. అయితే ఈ భేటీ మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గృహప్రవేశం సందర్భంగా జరిగిందని, అప్పుడు తీసిన ఫోటోనే సోషల్ మీడియాలో వైరల్ అయిందనే టాక్ వినిపించింది. తాజాగా అదే మన్సూరాబాద్ కార్పొరేటర్ రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో గతంలో కాంగ్రెస్ నేతలతో ఈటల భేటీ మరోసారి తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యలో హరీశ్ బాబు, నర్సింహారెడ్డి భేటీ వెనుక ఈటల రాజేందర్ ఉన్నారా? తాను ముందుగా కాంగ్రెస్ లోకి వెళ్లకుండా వ్యూహాత్మకంగా ఇతరులను అక్కడికి పంపి తనకంటూ ఓ స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

కాంగ్రెస్ వ్యూహం మార్చిందా?:

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు చావుదెబ్బ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ లోకి చేరిన వారిలో బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలే ఉండగా ఇకపై బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారా అనే టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, మన్సూరాబాద్ కార్పొరేటర్ నర్సింహారెడ్డిలు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పాల్వాయి హరీశ్ గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. సిర్పూర్ నియోజకవర్గ ఇన్ చార్జిగా వ్యవహరించారు. 2021లో ఆయన పార్టీని వీడి బీజేపీలో చేరారు. దీంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీలో పరిచయాలు ఉన్నాయి. అంతే కాకుండా ఆయన పేరెంట్స్ దివంగత పాల్వాయి పురుషోత్తం రావు, పాల్వాయి రాజ్యలక్ష్మి లు గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా పని చేశారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో త్వరలోనే పాల్వాయి హరీశ్ బాబు కాంగ్రెస్ గూటికి చేరుతారనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి.

Tags:    

Similar News