బీజేపీ జాబితా కన్ఫ్యూజన్!.. ప్రకటించిన లిస్టులోనూ మార్పులతో అయోమయం
బీజేపీ అభ్యర్థుల జాబితాలో గందరగోళం నెలకొంది.
దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ అభ్యర్థుల జాబితాలో గందరగోళం నెలకొంది. ప్రకటించిన జాబితాలోనూ మార్పులు, చేర్పులు చేస్తూ క్యాండిడేట్స్ జీవితాలతో ఆడుకుంటోంది. లిస్ట్‌లో తమ పేరు ఉందనే సంతోషించే లోపే మార్చేస్తోంది. దీంతో నేతలు అయోమయంలో పడ్డారు. తొలుత పలువురు నేతలకు రాష్ట్ర నాయకత్వం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. టికెట్ తమకే కన్ఫామ్ అయిందని శుభాకాంక్షలు కూడా తెలిపారు. కానీ తీరా చూస్తే జాబితాలో పేర్లు కనిపించకపోవడంతో బిత్తరపోయారు. మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్‌తో పాటు పలువురు నేతల పరిస్థితీ ఇలాగే ఉంది. ఈ సంగతి పక్కన పెడితే ఫైనల్ లిస్ట్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోనూ మార్పులు చేర్పులు చేపట్టడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో నేతలున్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. నాలుగు విడుతల్లో 100 మంది అభ్యర్థులను ప్రకటించిన కాషాయ పార్టీ చివరి విడుతలో 14 మందితో ఐదో జాబితాను గురువారం రిలీజ్ చేసింది. చివరి జాబితాలో ఇప్పటికే ప్రకటించిన ముగ్గురు అభ్యర్థులను మార్చింది. చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా ఊరడి సత్యనారాయణను పార్టీ ప్రకటించింది. కానీ ఆయన బరి నుంచి తప్పుకుంటానని రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేశారు. అనారోగ్య కారణాల వల్ల పోటీ చేయలేకపోతున్నానని, వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఆ స్థానాన్ని మరొకరికి కేటాయించారు. ఊరడి సత్యనారాయణకు బదులు కే మహేందర్‌కు పార్టీ టికెట్ కేటాయించింది.
అశ్వథ్థామరెడ్డికి షాక్
ఆర్టీసీ జేఏసీ మాజీ చైర్మన్ అశ్వథ్థామరెడ్డికి పార్టీ షాకిచ్చింది. తొలుత వనపర్తి స్థానాన్ని ఆయనకు ప్రకటించిన పార్టీ చివరి క్షణంలో అభ్యర్థిని మార్చింది. వనపర్తి స్థానాన్ని అనూగ్నరెడ్డికి కేటాయించింది. దీంతో ఆయన సందిగ్ధంలో పడ్డారు. అభ్యర్థుల ఎమోషన్స్‌తో బీజేపీ ఆడుకుంటోందనే చర్చ జరుగుతోంది. ఫోన్ కాల్స్ చేసింది కొందరికి అయితే ఫైనల్ లిస్టులో ఇంకొందరి పేర్లను ఖరారు చేయడంతో అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది.
అలా ఇచ్చి.. ఇలా లాక్కున్నారు
బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవికి అధిష్టానం తొలుత ఊహించని షాకిచ్చింది. ఆ స్థానాన్ని కొయ్యల ఏమాజికి కేటాయిస్తూ స్పష్టంచేసింది. కాసేపటికే కొయ్యల ఏమాజిని మార్చి తిరిగి శ్రీదేవికే టికెట్ కేటాయించింది. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి స్పష్టంచేశారు. అంతేకాకుండా అలంపూర్ అసెంబ్లీ స్థానం తొలుత మేరమ్మకు కేటాయించిన అధిష్టానం ఫైనల్‌గా రాజగోపాల్ పేరు ఖరారు చేసింది. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకట్రెండు స్థానాల్లో అభ్యర్థులు మారుతారని ముందుగానే చెప్పారు.
ఇదిలా ఉండగా నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులకు జాబితా విడుదలకు ముందే రాష్ట్ర నాయకత్వం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లినట్లు తెలిసింది. సమయం లేకపోవడంతో నామినేషన్లకు ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు. అయితే ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే జాబితా ఆలస్యమైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా మొత్తం 119 స్థానాలుండగా అందులో 8 సీట్లు జనసేనతో పొత్తులో భాగంగా కేటాయించారు. ఐదు విడుతల్లో కమలం పార్టీ మొత్తం అభ్యర్థులను ప్రకటించింది.
పట్టువదలని బండి
సంగారెడ్డి స్థానంపై బండి సంజయ్ తన పంతం నెగ్గించుకున్నారు. ఈ స్థానంపై కూడా బండి వర్సెస్ ఈటల అన్నట్లుగా సాగింది. సంగారెడ్డి టికెట్‌ను పులి మామిడి రాజుకు ఇవ్వాలని ఈటల పట్టుపట్టారు. కానీ ఎట్టకేలకు పార్టీ బండి సంజయ్ ప్రతిపాదించిన పేరునే ఫైనల్ చేసింది. బండి సంజయ్ వర్గానికి చెందిన దేశ్ పాండే రాజేశ్వర్ రావుకు కేటాయించిచంది.
పంతం నెగ్గించుకున్న కొండా
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తన పార్లమెంట్ పరిధిలో సీట్లను తాను అనుకున్న వారికి ఇప్పించడంలో సక్సెస్ అయ్యారు. రాజేంద్రనగర్ టికెట్‌ను రెడ్డికే ఇవ్వాలని ఆయన పట్టుపట్టారు. దీంతో అధిష్టానం తోకల శ్రీనివాస్ రెడ్డికే కేటాయించింది. శేరిలింగంపల్లి స్థానాన్ని కూడా ఆయన ప్రతిపాదించిన పేరునే హైకమాండ్ ఫైనల్ చేసింది. ప్రధానంగా శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానం విషయంలో నేతల మధ్య తీవ్ర విబేధాలు తలెత్తాయి.
ఈ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తారని చెప్పడంతో శేరిలింగంపల్లికి చెందిన ఆశావహులు జనసేనకు ఇవ్వొద్దని పట్టుపట్టారు. ఈ సీటు కోసం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఆ స్థానాన్ని రవికుమార్ యాదవ్‌కు కేటాయించాలని, లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సి ఉంటుందని పార్టీపై ఒత్తిడి తేవడంతో ఆ స్థానాన్ని జనసేనకు ఇవ్వలేదు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 30 శాతం ఓట్లు శేరిలింగంపల్లిలో ఉండటమే ఆయన పట్టుపట్టేందుకు కారణంగా తెలుస్తోంది.
కాగా శేరిలింగంపల్లి స్థానం తనకే ఇవ్వాలని పార్టీ సీనియర్ నేత గజ్జెల యోగానంద్ పట్టుపట్టారు. తన సీటు విషయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎంపీ అర్వింద్ వేలు పెట్టడంపై ఆయన బాహాటంగానే ఆగ్రహం వ్యక్తంచేశారు. కోరుట్లలో తనకూ ఫ్రెండ్స్ ఉన్నారని, ఏం చేయాలో తనకు తెలుసని వార్నింగ్ ఇచ్చారు. అలాగే తనకు శేరిలింగంపల్లి స్థానాన్ని కేటాయించకుంటే చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని యోగానంద్ చెప్పడం గమనార్హం. ఏది ఏమైనా కమలం పార్టీ తుది జాబితాను విడుదల చేయడంతో అభ్యర్థులు నేతలు నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సంఖ్య అసెంబ్లీ స్థానం అభ్యర్థి పేరు
01 పెద్దపల్లి దుగ్యాల ప్రదీప్
02 సంగారెడ్డి దేశ్ పాండే రాజేశ్వర్ రావు
03 మేడ్చల్ ఏనుగు సుదర్శన్ రెడ్డి
04 మల్కాజ్ గిరి ఎన్ రాంచందర్ రావు
05 శేరిలింగంపల్లి రవికుమార్ యాదవ్
06 నాంపల్లి రాహుల్ చంద్ర
07 కంటోన్మెంట్ గణేశ్ నారాయణ్
08 దేవరకద్ర కొండ ప్రశాంత్ రెడ్డి
09 అలంపూర్ రాజగోపాల్
10 నర్సంపేట పుల్లారావు
11 మధిర పెరుమార్ పల్లి విజయరాజు
12 చాంద్రాయణగుట్ట కే మహేందర్
13 బెల్లంపల్లి శ్రీదేవి
14 వనపర్తి అనూగ్న రెడ్డి