బీఆర్ఎస్‌కు ఓటేస్తే చెత్త కుప్పలో వేసినట్టే: కిషన్ రెడ్డి

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే తరహా రుచి చూస్తుందని, ఆ పార్టీ అవసరం ఇప్పుడు తెలంగాణలో లేదని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Update: 2024-01-04 11:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే తరహా రుచి చూస్తుందని, ఆ పార్టీ అవసరం ఇప్పుడు తెలంగాణలో లేదని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఇప్పుడు ఒక ఔట్‌డేటెడ్ పార్టీ అని, అది ఇకపైన ఫామ్‌హౌజ్‌కు మాత్రమే పరిమితం అవుతుందన్నారు. నాంపల్లి స్టేట్ ఆఫీసులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు గెలిచినా గొప్పేనని, అయినా దాని ప్రభావం ఏమీ ఉండదన్నారు. ఆ పార్టీకి ఓటు వేసినా చెత్తకుప్పలో వేసినా ఒకటేనని అన్నారు. అంబర్‌పేట్‌లో ఆ పార్టీని మూడుసార్లు తాను ఓడించానని అన్నారు. సీబీఐ ఎంక్వయిరీతో కేసీఆర్‌ను కాపాడాలని తాను ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని, కానీ వాస్తవానికి జ్యుడిషియల్ ఎంక్వయిరీ పేరుతో ఆయనను సేవ్ చేయాలనుకుంటున్నది రేవంత్‌రెడ్డేనని అన్నారు.

తెలంగాణలో గెలిచింది కాంగ్రెస్ అయినా దాన్ని గెలుపుగా భావించలేమని, బీఆర్ఎస్ ఓడిపోయింది అనడమే కరెక్టుగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ఓడిపోయినందునే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తప్ప బీఆర్ఎస్‌ను ఓడించలేదని అన్నారు. ప్రధాని మోడీని ఎక్స్ పైరీ మెడిసిన్ అంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారుగానీ వాస్తవానికి రాహుల్‌గాంధీ ఉన్నన్ని రోజులు మోడీ అనే మెడిసిన్‌కు ఎక్స్ పైరీ డేట్ ఉండదన్నారు. మరోవైపు రాహుల్‌గాంధీ ఫార్ములా దేశవ్యాప్తంగా వికటించిందని, ఆ పార్టీని ఎంతమాత్రం ఒక మెడిసిన్‌గా భావించలేమన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా దాటవేయడానికే దరఖాస్తుల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

Tags:    

Similar News