కేసీఆర్ ఖాసీం రజ్వీని మించిపోయాడు.. డీకే అరుణ ఫైర్
టీఎస్ పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో నిరుద్యోగుల పక్షాన ఆందోళన చేస్తున్న బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైరయ్యారు.
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో నిరుద్యోగుల పక్షాన ఆందోళన చేస్తున్న బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైరయ్యారు. దీన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తప్పిదాలవల్ల లక్షలాది మంది నిరుద్యోగులకు జరుగుతున్న నష్టాన్ని ఎత్తిచూపుతూ నిరసన తెలపడం ప్రజాస్వామిక హక్కు అని, ఆ హక్కును కాలరాసేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రూప్-1 పేపర్ సైతం లీక్ అయ్యిందని, దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలొస్తున్న నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు జరిపి చిత్తుశుద్ధి నిరూపించుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా తప్పులను ఎత్తిచూపుతున్న వాళ్లపై అమానుషంగా వ్యవహరిస్తూ నిరసనకారుల గొంతునొక్కుతుండటం సిగ్గుచేటని ఆమె ఘాటు విమర్శలు చేశారు. ఈ విషయంలో కేసీఆర్ ఖాసీం రజ్వీని మించిపోయారని విమర్శలు చేశారు. పరీక్షలను సక్రమంగా నిర్వహించడం కేసీఆర్ సర్కార్కు చేతకాలేదని, కానీ ప్రశ్నించే వాళ్ల గొంతు మాత్రం నొక్కుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. అరెస్ట్ చేసిన బీజేవైఎం కార్యకర్తలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు ఏ ఒక్క ఉద్యోగ పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయిందని డీకే అరుణ ధ్వజమెత్తారు. కేసీఆర్ సర్కార్ చేతగానితనానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వ తప్పిదాలవల్ల గతంలో ఇంటర్మీడియట్, ఎంసెట్ విద్యార్థులు సైతం ఇబ్బంది పడ్డారని, సీఎం కొడుకు, మంత్రి కేటీఆర్ నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు బలయ్యారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉద్యోగాలను భర్తీ చేయాలనే చిత్తశుద్ధి లేదని, అందులో భాగంగానే నోటిఫికేషన్ మొదలు పరీక్షలు, ఇంటర్వ్యూలు, నియామకాల వరకు రకరకాల ఇబ్బందులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వేసిన ప్రతిసారి కోర్టుకు వెళ్లే అవకాశమిచ్చేలా లోపాలను జోడిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడేమో ప్రశ్నపత్రం లీకేజీలతో లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలతో కేసీఆర్ సర్కార్ చెలగాడమాడుతోందని మండిపడ్డారు. ఒక పేపర్ ప్రశ్నాపత్రం లీకేజీపై విచారణ చేస్తుంటే ఇంకో ప్రశ్నాపత్రం లీకేజీ అంశం వెలుగులోకి వస్తోందని, దీనిపై సమగ్ర విచారణ జరిపితే ఇంకెన్ని లీకులు బయటపడతాయోనని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కేసీఆర్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.