కమల్‌కు 'Saral' యాప్.. డిజిటలైజేషన్ దిశగా BJP
రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాషాయదళం పావులు కదుపుతోంది. పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ ప్రక్రియతో వచ్చే ఎలక్షన్‌కు సిద్ధమవుతోంది.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాషాయదళం పావులు కదుపుతోంది. పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ ప్రక్రియతో వచ్చే ఎలక్షన్‌కు సిద్ధమవుతోంది. తెలంగాణ సర్కార్‌ను ఢీకొట్టేందుకు 'సరళ్' అనే ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించుకుంది. సంఘటన్ రిపోర్టింగ్ అండ్ అనాలసిస్‌ను షార్ట్ కట్‌లో 'సరళ్' అని బీజేపీ నామకరణం చేసుకుంది. పేరుకు తగినట్లుగానే పార్టీ యాక్టివిటీసీ, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంపై ఒకేసారి సరళంగా జరిగేలా బూత్ స్థాయి నేతలకు ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇవ్వడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశ్యం. రాష్ట్ర ప్రభుత్వంపై ఏకకాలంలో రాష్ట్రమంతటా పోరాటాలు చేసేందుకు ఈ యాప్ దోహదపడనుంది. నేరుగా పార్టీ హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది. తెలంగాణలో ఈ యాప్‌ను ఈనెల 7వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ వర్చువల్ మీట్ సక్సెస్ చేసే బాధ్యతలను పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డికి అప్పగించారు.
తెలంగాణ కాషాయ దళం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతోంది. గ్రౌండ్ లెవల్ ప్రిపరేషన్ కూడా ఇప్పటికే మొదలుపెట్టింది. ఇందుకోసం బూత్ స్థాయి నుంచి నేతలను సమన్వయం చేసుకునేందుకు సరళ్ అనే ప్రత్యేక యాప్ ను రూపొందించింది. బూత్ స్థాయి కమిటీ సభ్యుల వివరాలను ఇందులో పొందుపరుచనుంది. ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసేందుకు నియోజకవర్గానికో సోషల్ మీడియా కన్వీనర్లను ఇప్పటికే నియమించింది. వారికి ఇప్పటికే ఈ యాప్ వినియోగంపై శిక్షణ తరగతులు కూడా పూర్తయ్యాయి. సింగిల్ క్లిక్ లోనే బూత్ స్థాయి నేతలకు సమాచారం అందేలా ఈ యాప్‌ను రూపకల్పన చేశారు. ఇదిలా ఉండగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బూత్ స్థాయి సభ్యులతో వర్చువల్‌గా సమావేశం అవుతున్న విషయం తెలిసిందే. కాగా అదేరోజు వర్చువల్ మీట్‌లోనే తెలంగాణలో ఈ యాప్‌ను నడ్డా ప్రారంభోత్సవం చేయనున్నారు. యాప్‌ను ప్రారంభించిన అనంతరం జేపీ నడ్డా బూత్ స్థాయి కమిటీ సభ్యులనుద్దేశించి దిశానిర్దేశం చేయనున్నారు.
కేసీఆర్ సర్కార్‌కు చెక్ పెట్టడంతో పాటు తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు నేరుగా హైకమాండ్ రంగంలోకి దిగింది. ఈ యాప్ పూర్తిగా జాతీయ నాయకత్వం కనుసన్నల్లోనే ఉండనుంది. సంస్థాగత బలోపేతం మొదలు, పలు కార్యక్రమాల రూపకల్పన కూడా ఇక్కడే జరగనుంది. బూత్ కమిటీ సభ్యులతో నేరుగా హైకమాండ్ ఎప్పటికప్పుడు టచ్ లోకి ఉండేలా సరళ్ యాప్‌ను రూపొందించింది. కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలను తూచ తప్పకుండా అమలయ్యేలా కమలనాథులు యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్గనైజేషన్ పరంగా స్ట్రెంథెన్ అవడంతో పాటు పొలిటికల్ యాక్టివిటీకి ఇది దోహదపడుతుందని హైకమాండ్ బలంగా నమ్ముతోంది. వాస్తవానికి సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో బీజేపీ ఎప్పుడూ ఒకడుగు ముందుగానే ఉంటోంది. ఈ విషయంలో ఇతర పార్టీలు అందుకోలేనంత స్పీడ్ కమలనాథులు మెయింటైన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఇది ఉపయోగపడనుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బూత్ స్థాయి నేతలకు అందించి ప్రజలకు చేర్చడమే కాకుండా ఆందోళనలకు పిలుపునివ్వడం కూడా సింగిల్ క్లిక్‌లో జరిగిపోతుంది.
సరళ్ యాప్ ను ఇప్పటికే గుజరాత్ ఎన్నికల్లో కమలనాథులు వినియోగించారు. బూత్ స్థాయి నేతలకు చేరువకావడంతో వారు నిత్యం ప్రజల్లోనే ఉండేలా దిశానిర్దేశం చేయడం కాషాయ పార్టీకి కలిసొచ్చింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సరళ్ యాప్‌ను బీజేపీ విస్తృతంగా వినియోగించుకుని సక్సెస్ రేటు సాధించింది. అదే విధానాన్ని తెలంగాణలోనూ ఇంప్లిమెంట్ చేయబోతోంది. పశ్చిమ బెంగాల్‌లోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేసిన బీజేపీ అధికారంలోకి రాకపోయినా భారీగా ఓటు బ్యాంకు సంపాదించుకుంది. అయితే గుజరాత్, మధ్యప్రదేశ్‌లో జరిగిన సీనే తెలంగాణలోనూ రిపీట్ చేస్తామని తెలంగాణ కాషాయ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. మరి కమలనాథుల డిజిటల్ వ్యూహం తెలంగాణలో ఫలిస్తుందా? బెడిసికొడుతుందా? అనేది వేచిచూడాల్సిందే.
అధికారంలోకి వచ్చి తీరుతాం : బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి
తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే. ఇప్పటికే అది పలు ఉప ఎన్నికల్లో కన్ఫామ్ అయింది. ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తీరుతాం. ఈనెల 7వ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ మీట్ ద్వారా 'సరళ్' యాప్‌ను ప్రారంభిస్తారు. బూత్ కమిటీ సభ్యులకు వచ్చే ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు. ఈ యాప్‌ను పలు రాష్ట్రాల్లో వినియోగించి సక్సెస్ అయ్యాం. ఇక్కడ కూడా సక్సెస్ అవుతాం. ఎలాంటి హ్యాకింగ్ కు గురికాకుండా యాప్‌ను రూపొందించారు. పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. మానిటరింగ్ మొత్తం సెంట్రల్ పార్టీ కనుసన్నల్లో ఉంటుంది. 7వ తేదీన బూత్ స్థాయి కమిటీ సభ్యుల సమ్మేళననాన్ని విజయవంతం చేసేందుకు పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తున్నాను. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా జాబితా కూడా సిద్ధమైంది.
Also Read....