BJP: కాంగ్రెస్ సర్కార్‌కు సంక్రాంతి వరకు డెడ్ లైన్.. కేంద్రమంత్రి బండి సంజయ్

అర్బన్ నక్సల్స్ చేతిలో రేవంత్ సర్కార్ బందీ అయిందని, భాగ్యనగర్ మరో బంగ్లాదేశ్ గా మార్చే కుట్రకు రేవంత్ సర్కార్ తెర లేపిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

Update: 2024-12-07 16:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అర్బన్ నక్సల్స్ చేతిలో రేవంత్ సర్కార్ బందీ అయిందని, భాగ్యనగర్ మరో బంగ్లాదేశ్ గా మార్చే కుట్రకు రేవంత్ సర్కార్ తెర లేపిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శనివారం సరూర్ నగర్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. రేవంత్ రెడ్డిని ప్రజలు సీఎంగా గుర్తించడం లేదన్నారు. ఏ సర్వేలో చూసిన కాంగ్రెస్ 3 స్థానంలో ఉందన్నారు. ‘భాగ్యనగర్ ప్రజలారా... స్వామి వివేకానంద, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, కొమరం భీం, సేవాలాల్ మహారాజ్ లా మారతారా...? లేక నక్సలైట్లుగా మారతారా? ఆలోచించండి’’అని కోరారు. రేవంత్ రెడ్డి వాడుతున్న భాష, ఆడుతున్న అబద్దాలను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వానికి సంక్రాంతి వరకు డెడ్ లైన్ విధిస్తున్నామన్నారు. ఆలోగా 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగనీయమనిహెచ్చరించారు. 25 వేల పోస్టులకే నోటిఫికేషన్లు ఇచ్చారని, మరీ 55 వేల పోస్టులు ఎలా భర్తీ చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మకై రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.బీజేపీ చల్లబడిందని ప్రచారం చేసే వాళ్ల చెంప చెళ్లుమన్పించాలని, బీఆర్ఎస్ తూట్ పాలిష్ నాయకుల లెక్క బీజేపీ కార్యకర్తలుండరన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, క్యాడర్ బయటకు రావడం లేదని, బీజేపీ కార్యకర్తలు అలా కాదని వారు ఫైర్ బ్రాండ్స్ అని సంజయ్ అన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ప్రజా సమస్యలపై కొట్లాడిండా..? రైతుల కోసం, మహిళల కోసం, నిరుద్యోగుల కోసం నిలబడలేదన్నారు. బీజేపీ కార్యకర్తలు ఏనాడు కాషాయ జెండాను వీడలేదని స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే వికసించేది కాషాయమేనని తెలిపారు. ఒక సెక్షన్ మీడియా, టీవీ ఛానళ్లు రేవంత్ రెడ్డి పక్షాన ఉన్నాయని, ఏదో సొంత డబ్బాకొట్టుకుంటున్నారన్నారు. తెలంగాణలో జరిగే ప్రతి అభివృద్ధి పనులకు నిధులిస్తోంది కేంద్రం కాదా..అంటూ ప్రశ్నించారు. పైసలన్ని మోదీ ప్రభుత్వం ఇస్తుంటే ప్రధాని ఫొటో పెట్టకుండా ఇందిరమ్మ,న సోనియమ్మ పేరుతో రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడన్నారు. ఏడాదిలో పేదలందరికీ ఇండ్లు కట్టిస్తానన్నడు. ఒక్క ఇల్లు అయినా కట్టించారా? నరేంద్రమోదీ ప్రభుత్వం లక్షల ఇండ్లు మంజూరు చేస్తే ఆ నిధులను ఆనాడు బీఆర్ఎస్ సర్కార్ దారి మళ్లిస్తే...ఈనాడు ముగ్గు పోసి ఇల్లు కట్టకుండా మోసం చేస్తున్న ఘనత కాంగ్రెస్ దేనని విమర్శించారు. రాష్ట్రంలో నిర్మించే ఇండ్లకు నిధులిస్తున్నది నరేంద్రమోదీ ప్రభుత్వం అనే విషయాన్ని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని కార్యకర్తలను కోరారు.ఈ సారి జీహెచ్ ఎంసీ మేయర్ పీఠం కాషాయ జెండాదేనని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ షాక్ ఇవ్వబోతున్నామన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమ శంఖం పూరించాం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ....ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఏండ్ల పాటు పోరాటం చేశామని, బలిదానాలు జరిగాయని, సకలజనుల సమ్మె చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ, అహంకార, అవినీతి పాలనతో తెలంగాణ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని, 420 హామీలు ఇచ్చారన్నారు. ఏడాదైన ఒక్క హామీని సరిగా అమలు చేయలేదన్నారు.బీఆర్ఎస్ -కాంగ్రెస్ పార్టీలవి ఒకే డీఎన్ఏ. ఒకే తానుముక్కలని, పాలనలో కేసీఆర్, రేవంత్ రెడ్డి కవలపిల్లలని ఎద్దేవా చేశారు. డిసెంబరు 9న సోనియా జన్మదినం సందర్భంగా రైతు రుణమాఫీ చేస్తామని, పెన్షన్లు 2000 రూపాయల నుంచి 4 వేలు చేస్తామని హామీలిచ్చారు. రుణమాఫీ పూర్తిచేయలేదు. పెన్లన్లు రూ. 4 వేలకు పెంచలేదు. ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదని విమర్శించారు.గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు ఇస్తే.. బిజెపి ని 8 సీట్లలో గెలిపించారన్నారు. రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడాలని కోరుకుంటున్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమ శంఖం పూరించామని ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీ జెండా ఎగురవేస్తామన్నారు.

అనంతరం ఈటల మాట్లాడుతూ...కాంగ్రెస్ అధికారంలోకి వస్తామని ఇచ్చిన హామీలు కావన్నారు. అలాగే మూసికి అటు ఇటు ఉన్న భూములు గుంచుకొని అదానీకి, పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెట్టాలని సీఎం అనుకుంటున్నారు అని తెలిపారు. దళితులు, పేద రైతుల ఎలా గుంజుకోవాలని తప్ప ఇచ్చిన హామీలు అమలు చేసే దమ్ము లేదు అని.. అందుకే రేవంత్ రెడ్డి 10 నెలల్లోనే అభాసు పాలు అయ్యారని ఈటల పేర్కొన్నారు.

ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ... ప్రజలను మరోసారి మోసం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేస్తుందన్నారు.. ముఖ్యమంత్రిది నోరేనా.. గత ముఖ్యమంత్రిని గద్దె దించిన సోయి లేదా.. కేసీఆర్ తో పోటీ పడి తిడుతున్నారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో రేవంత్ రెడ్డి. ఢిల్లీకి వచ్చి కాగితాలు ఇచ్చి అడుక్కుంటారు.. బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతారు. లక్కీ లాటరీ తగిలి సీఎం అయ్యారు. అప్పుడో కుటుంబ పాలన, ఇప్పుడో కుటుంబ పాలనతో తెలంగాణ ప్రజలు అవస్థలు పడుతున్నారని, బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజల బతుకులు బాగుపడతాయన్నారు.

మెదక్ ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ....ఒక నియంత పాలనకు చరమగీతం పాడితే, తెలంగాణలో ప్రజాపాలన వచ్చిందని, ప్రజల బతుకుల్లో మార్పులొస్తాయని, జీవనవిధానంలో మార్పు వస్తుందన్నారు.విగ్రహాల రూపాలు, పార్టీల జెండాల రంగులు మారుతున్నాయి. కాని, ప్రజల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. ప్రజలు కలెక్టర్ పై దాడి చేసిన రోజే రేవంత్ రెడ్డి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందని కానీ ఇప్పటికీ చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి భాష తీరు మార్చుకోవాలని హితవు పలికారు.42 పేజీలతో కూడిన కాంగ్రెస్ మేనిఫెస్టోను ఒక్కసారైన రేవంత్ రెడ్డి చదవాలన్నారు.

దేశాన్ని అస్థిర పర్చే కుట్రలకు కాంగ్రెస్ తెరలేపింది.. రాజ్యాసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్

రాజ్యాసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ..74 లక్షల మంది రైతులు అప్పు తీసుకుంటే.. కేవలం 24 లక్షల మందికే రుణమాఫీ చేశారన్నారు.రాష్ట్రంలో రూ. 17 వేల కోట్ల మేర రుణమాఫీ జరిగిందని.. భవిష్యత్తులో మరో రూ. 14 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని మరో మంత్రి పొంతనలేని మాటలు చెబుతూ పబ్బం గడుపుతున్నారన్నారు. నరేంద్ర మోదీ ప్రపంచంలోనే తిరుగులేని నాయకుడుగా మారుతున్నారనే అక్కసుతో రాహుల్ గాంధీ పార్లమెంటు కార్యకాలాపాలను స్తంభింపజేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.కరోనా ఆపత్కాలంలో కొవిడ్ బాధితులకు ఊరట కల్పించిన సమయంలో కొవాగ్జిన్ కు వ్యతిరేకంగా జార్జ్ సోరోస్ సంస్థలతో పాటు రాహుల్ గాంధీ విష ప్రచారం చేశారన్నారు. విదేశీ శక్తుల కుట్రలకు ఊతమచ్చేలా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జార్జ్ సోరోస్ -రాహుల్ గాంధీ శరీరాలు వేరు కావచ్చు.. వారిద్దరి ఆత్మ ఒక్కటేనని దేశాన్ని అస్థిర పర్చే కుట్రలకు కాంగ్రెస్ తెర లేపిందని ఆరోపించారు.

Tags:    

Similar News