BJP: బూత్ కమిటీ ఎన్నికలకు డెడ్‌లైన్.. ఈనెల 10 వరకు ఛాన్స్
రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికలపై దృష్టిసారిస్తున్న బీజేపీ బూత్ కమిటీలకు డెడ్ లైన్ విధించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికలపై దృష్టిసారిస్తున్న బీజేపీ బూత్ కమిటీలకు డెడ్ లైన్ విధించింది. ఈనెల 10వ తేదీ వరకు కమిటీలు కంప్లీట్ చేయాలని ఆదేశించింది. బూత్ కమిటీల ఏర్పాటు అనంతరం వెంటనే మండల కమిటీలను ఎన్నుకోవాలని సూచించింది. డిసెంబర్ 11 నుంచి 20వ తేదీ వరకు దీనికి పార్టీ గడువు ఇచ్చింది. ఇచ్చిన సమయంలోపే దీన్ని పూర్తిచేయాలని దిశానిర్దేశం చేసింది. మండల కమిటీల అనంతరం అంటే డిసెంబర్ 20 తర్వాత జిల్లా కమిటీలను ఏర్పాటుచేయాలని అధిష్టానం దిశానిర్దేశం చేసింది. పార్టీని గ్రౌండ్ లెవల్ నుంచి బలోపేతం చేసేందుకు ఇది కీలకం కానున్న నేపథ్యంలో సీరియస్ గా తీసుకోవాలని స్పష్టంచేసింది.
వయసు నిబంధన..
కమిటీ అధ్యక్షుల నియామకానికి అర్హత వయస్సును కటాఫ్ గా పెట్టింది. మండల అధ్యక్షులకు 45 సంవత్సరాలు, జిల్లా అధ్యక్షులు 60 ఏళ్లలోపు ఉండాలనే నిబంధనను అమలుచేయనుంది. జిల్లాల్లో కనీసం ఒక్క మండలానికి అయినా మహిళా అధ్యక్షురాలిని నియమించాలని పార్టీ ప్లాన్ చేస్తున్నది. సబ్బండ వర్గాలకు ప్రయారిటీ ఇస్తూనే మహిళలను రాజకీయంగా చైతన్యవంతుల్ని చేసేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ కమిటీల నియామకం అనంతరం రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు ఉండనున్నాయి. డిసెంబర్ నెలాఖరున రాష్ట్ర అధ్యక్ష, జనవరిలో జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగే అవకాశముంది.
ఏర్పాట్లలో నేతలు
నవంబర్ నెలలోనే బూత్ కమిటీలను పూర్తిచేయాలని బీజేపీ భావించింది. అయితే పలు కారణాల వల్ల జాప్యం జరిగింది. మరోవైపు సంస్థాగత ఎన్నికల కోసం కమలం పార్టీ ఇప్పటికే జాతీయ, రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించింది. ఇప్పటికే పార్టీ జాతీయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మణ్ అన్ని రాష్ర్టాలను చుట్టేస్తున్నారు. సంస్థాగత ఎన్నికలపై నిర్వహించే సమావేశాల్లో పాల్గొని దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో యెండల లక్ష్మీనారాయణ నిమగ్నమయ్యారు. బూత్ కమిటీలు పూర్తయిన తరువాత ఢిల్లీలో అన్ని రాష్ర్టాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో అధిష్టానం సమావేశంకానుంది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా డిసెంబర్ 20న జిల్లాస్థాయిలో కార్యశాలలను నిర్వహించనున్నారు.