తెలంగాణలో బీజేపీ భారీ స్కెచ్.. రంగంలోకి స్పెషల్ టీమ్స్

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ సరికొత్త వ్యూహాన్ని రూపొందిస్తున్నది. యూపీ గెలుపుతో ఎత్తుగ

Update: 2022-03-29 05:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ సరికొత్త వ్యూహాన్ని రూపొందిస్తున్నది. యూపీ గెలుపుతో ఎత్తుగడలకు పదును పెడుతున్నది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి టీఆర్ఎస్ తరహాలోనే ప్రతి జిల్లా కేంద్రంలోనూ పార్టీ ఆఫీసును పెట్టాలనుకుంటున్నది. ఎన్నికలతో సంబంధం లేకుండా బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేయాలనుకుంటున్నది. పోల్ మేనేజ్‌మెంట్‌పై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నది. ఇందుకోసం కొన్ని స్పెషల్ టీమ్స్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి. త్వరలో కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు కూడా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించనున్నారు. బీజేపీ తన సొంత పార్టీ శ్రేణులతోపాటు ఆర్ఎస్ఎస్ సహా అనుబంధ సంస్థల కార్యకర్తలు, వాలంటీర్ల సేవలను కూడా ఎన్నికల సమయంలో వినియోగించుకోవడం ఆనవాయితీ. దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఈ తరహా ప్లాన్‌ను పకడ్బందీగా అమలుచేసింది. ఇకపై రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ దీన్ని అమలు చేయాలనుకుంటున్నది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేంద్ర మంత్రులను, జాతీయ నాయకులను రప్పించి ప్రచారంలో భాగస్వాములను చేసిన విధానం సత్ఫలితాలను ఇచ్చిందని కేంద్ర నాయకత్వం బలమైన అభిప్రాయంతో ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ దీన్నే రిపీట్ చేయాలనుకుంటున్నది.

దశలవారీగా.. పక్కా వ్యూహంతో...

పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసుకోవడంపై ఇప్పటికే కసరత్తు చేసిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించుకుంటున్నది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నది. కులాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు, పార్టీలతో సంబంధం తదితర పలు అంశాలపై స్టడీ చేయడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. సెగ్మెంట్ సమగ్ర సమాచారాన్ని విశ్లేషించి ఓటర్లను ఆకట్టుకోడానికి ఏం చేయాలో తెలుసుకునే బాధ్యత వీటిది. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నది, ఏ అంశాల్లో ఉన్నది, దానికి ప్రత్యామ్నాయంగా ఏం కోరుకుంటున్నారు తదితరాలపైనా వివరాలను రాబడతాయి. నియోజకవర్గాల్లో కులాలవారీ ఓట్లు, ఆ సామాజిక వర్గం నుంచి ప్రతినిధులుగా ఉన్న బలమైన నాయకులెవరు? ఓటర్లను వారు ఏ మేరకు ప్రభావితం చేస్తారు? ప్రస్తుతం ఏ పార్టీతో కొనసాగుతున్నారు? వీటిపై టీమ్‌లు అధ్యయనం చేస్తాయి. వారిని బీజేపీవైపు ఆకర్షించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలు, అవలంబించాల్సిన వ్యూహంపై కేంద్ర నాయకత్వం సూచనలు చేస్తుంది. కచ్చితంగా గెలిచే స్థానాలు, సెకండ్ ప్లేస్ వచ్చే సెగ్మెంట్లు, బాగా బలహీనంగా ఉన్నవి.. ఇలా మూడు కేటగిరీల్లో జాబితాను రూపొందిస్తాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ కేంద్ర పార్టీ నాయకత్వం గైడెన్సులో ఈ టీమ్‌లు నిరంతరం నియోజకవర్గాల్లో పనిచేస్తూనే ఉంటాయి. ఒక్కో టీమ్‌కు ఒక్కో టాస్కును కేంద్ర నాయకత్వం అప్పగిస్తుంది.

జనరల్ స్థానాల్లోనూ దళిత అభ్యర్థులు

రాష్ట్రంలో 19 ఎస్సీ, 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు కోసం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం సమీక్షలు నిర్వహించింది. పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో దీనిపై లోతుగానే చర్చించింది. జనరల్ స్థానాల్లోనూ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను రంగంలోకి దించాలనుకుంటున్నది. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరనే అభిప్రాయం ఉన్నప్పటికీ భారీ స్థాయిలో ఇతర పార్టీల నుంచి కమలం గూటికి చేర్చే ప్రక్రియపైనా కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు దృష్టి పెట్టాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు అధికార పార్టీకి సమాన స్థాయిలో కార్పొరేటర్లను గెలిపించుకోవడంలో కేంద్ర మంత్రులు, జాతీయ నాయకుల ప్రచారం బాగా దోహదపడిందనే అభిప్రాయంతో సెంట్రల్ లీడర్‌షిప్ ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలకూ దాన్నే అమలుచేయాలనుకుంటున్నది. యూపీ ముఖ్యమంత్రిగా గెలిచిన యోగి ఈసారి తెలంగాణలో వీలైనంత విస్తృతంగా పర్యటించేలా ప్లాన్ చేస్తున్నది.

Tags:    

Similar News