మైనంపల్లికి బిగ్ షాక్! బీజేపీలోకి నక్క ప్రభాకర్ గౌడ్..?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయపరంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది.

Update: 2023-11-04 05:51 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయపరంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. నియోజకవర్గంలో బలమైన బీసీ నేతగా ముద్రపడ్డ నక్క ప్రభాకర్ గౌడ్ అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయి అనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో మేడ్చల్ నియోజకవర్గం రాజకీయ ముఖచిత్రం మారనున్నది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన బీజేపీ పార్టీలోకి మారితే ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లు తారుమారు కానున్నాయి.


మైనంపల్లికి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు..

నక్క ప్రభాకర్ గౌడ్ ఆది నుంచి మైనంపల్లికి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు ఉన్నది. ఎంతలా అంటే మైనంపల్లి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారబోయే సమయంలో ఆయన కుమారుడు‌తో పాటుగా నక్క ప్రభాకర్ గౌడ్‌కు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను పెట్టారు. ప్రభాకర్ గౌడ్ తనకు అత్యంత ఆప్తుడని సోదర సమానులని మైనంపల్లి మీడియా ముఖంగా వెల్లడించారు. అదే క్రమంలో మైనంపల్లితో పాటు నక్క ప్రభాకర్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి మారి కొన్ని రోజులు కాకముందే ఆయన చూపులు బిజెపి వైపు ఉన్నాయని ప్రచారం జరుగుతుండగా, మైనంపల్లికి అత్యంత సన్నిహితుడైన ప్రభాకర్ గౌడ్ ఆయనను కాదని బీజేపీలోకి వెళ్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది..


బిజెపి నుంచి బంపర్ ఆఫర్..?

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు బీజేపీ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడ జరుగుతున్న అన్ని రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్న బీజేపీ ముఖ్య నాయకులు ఇదే నియోజకవర్గంలో ఒక బలమైన బీసీ నేతగా ముద్రపడిన నక్క ప్రభాకర్ గౌడ్‌ను తమ పార్టీలోకి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన బీజేపీ పార్టీలోకి వస్తే ఏకంగా మేడ్చల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తూ బి ఫాం ఇస్తామనే బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు పక్కా సమాచారం. నక్క ప్రభాకర్ గౌడ్ సైతం బీజేపీ పార్టీ బీఫామ్ ఇచ్చి పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీ మారెందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది.


నక్క ప్రభాకర్ గౌడ్ రాజకీయ ప్రస్థానం ఇది..

టీడీపీ హాయంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి రాష్ట్ర విభజన అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరి, అసెంబ్లీ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ టికెట్‌ను ఆశించినా ఫలితం లేకపోవడంతో 2018లో బీఎస్పీ నుండి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ నుండి మల్లారెడ్డి గెలుపొందడంతో మేడ్చల్ అభివృద్దే లక్ష్యంగా కలిసి పనిచేసేందుకు మళ్లీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తిరిగి 2023లో అసెంబ్లీ టికెట్టు ఆశించినా, అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు కేటాయించడంతో నక్క ప్రభాకర్ గౌడ్ నిరాశ చెందారు.

తదనంతరం మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అనుచరుడుగా నక్క ప్రభాకర్ గౌడ్ ఉండగా, మైనంపల్లి, తన కొడుకుకు టికెట్ల వ్యవహారంలో జరిగిన సర్దుబాటు లేకపోవడంతో మైనంపల్లితో పాటు నక్క ప్రభాకర్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మైనంపల్లి మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకోగా.. నక్క ప్రభాకర్ గౌడ్ మేడ్చల్ అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా పేరొందిన తోటకూర వజ్రెష్ (జంగయ్య) యాదవ్ కు టికెట్ కేటాయించడంతో, పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి హామీతో సమిష్టిగా పనిచేసేందుకు నక్క ప్రభాకర్ గౌడ్ సిద్ధపడ్డారు. మేడ్చల్ అసెంబ్లీలో విస్తృతమైన ప్రచార ప్రారంభిస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మల్లారెడ్డికి ధీటైన బీసీ నేతగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వజ్రేష్ యాదవ్‌ గట్టి పోటీని ఇస్తున్నారు.

Tags:    

Similar News