KCRకు బిగ్ షాక్.. జ్యుడీషియల్ కమిషన్ ఎంక్వైరీపై స్టేకి ‘నో’

విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలలో రాష్ట్ర ప్రభుత్వ, జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేస్తే తప్పేమున్నదని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు... కమిషన్ తదుపరి విచారణను వాయిదా వేయడానికి నిరాకరించింది.

Update: 2024-06-27 07:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలలో రాష్ట్ర ప్రభుత్వ, జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేస్తే తప్పేమున్నదని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు... కమిషన్ తదుపరి విచారణను వాయిదా వేయడానికి నిరాకరించింది. కమిషన్ ఈ నెల 19న ఇచ్చిన నోటీసు ప్రకారం జూన్ 27వ తేదీకల్లా కేసీఆర్ ఆ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉన్నది. దీన్ని పరిగణనలోకి తీసుకుని కమిషన్ ఇచ్చిన గడువు తేదీని ఒక రోజు పొడిగించేలా చూడాలని, అప్పటివరకు స్టే విధించాలని కేసీఆర్ తరఫున హాజరైన న్యాయవాది ఆదిత్య సోంధి హైకోర్టును కోరారు. కానీ ఇందుకు హైకోర్టు నిరాకరించింది. జ్యుడిషియల్ ఎంక్వయిరీ కంప్లీట్ అయిన తర్వాత ఎలాగూ రిపోర్టు వస్తుందని, దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత చర్చించొచ్చు గదా అని వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కోరిన రిలీఫ్‌కు (ఒక రోజు స్టేకు) సమ్మతించని హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణాల నిర్ణయాల్లో జరిగిన లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ ఇటీవల కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ కేసీఆర్ ఈ పిటిషన్‌ను వేశారు. ఈ పిటిషన్‌కు రిజిస్ట్రీ నంబరింగ్ ఇవ్వకపోవడంతో హైకోర్టును ప్రత్యేకంగా కోరడంతో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కేసీఆర్ తరఫు న్యాయవాది వాదిస్తూ... ఈఆర్సీ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేశామని, ఈఆర్సీ ఆమోదాలపై జ్యుడీషియల్ కమిషన్ ద్వారా ఎంక్వైరీ చేయకూడదని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం దానికి విరుద్ధంగా జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో నియమించిందని పేర్కొన్నారు.

తొలుత ఈ నెల 15 లోపు రిప్లై ఇవ్వాలంటూ కమిషన్ నోటీసులు పంపిందని, కేసీఆర్ రిప్లై ఇచ్చేలేపే ఈనెల 11న జస్టిస్ నర్సింహరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వం తప్పులు చేసినట్లు తెలిపారని పేర్కొన్నారు. కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నట్లుగా జస్టిస్ నర్సింహారెడ్డి మాట్లాడడాన్ని తప్పుపట్టారు. భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌లో సట్ క్రిటికల్ టెక్నాలజీని వాడడాన్ని కమిషన్ తప్పుపడుతున్నదని, కానీ దేశవ్యాప్తంగా చాలా ప్రాజెక్టులు ఆ టెక్నాలజీతోనే నిర్మాణమయ్యాయని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ను నియమించడంలోనే ఉల్లంఘన ఉన్నదన్నారు. ఈ నెల 19న మరో నోటీసు ఇచ్చిన కమిషన్... జూన్ 27 వరకు హాజరుకావాల్సిందిగా స్పష్టం చేసిందని, ఎంక్వయిరీ కమిషన్ యాక్టులోని సెక్షన్ 8(బి) కింద నోటీస్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 30 వరకు రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాలని కమిషన్‌పై ఒత్తిడి ఉన్నదని గుర్తుచేశారు. ఇది పూర్తిగా పొలిటికల్ ఎజెండాతో వేసిన కమిషన్ అని ఆరోపించారు. ప్రభుత్వం తరఫున శుక్రవారం విచారణ సందర్భంగా వాదనలు వినిపించనున్న అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి.


Similar News