గజ్వేల్‌లో CM KCRకు బిగ్ షాక్! బీజేపీలోకి పలువురు కీలక నాయకులు
ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజవర్గమైన గజ్వేల్‌లో రోజు రోజుకి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.
దిశ, తూప్రాన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజవర్గమైన గజ్వేల్‌లో రోజు రోజుకి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రెండు రోజుల క్రితమే మనోహరాబాద్ మండల కల్లకల్ సర్పంచ్ రాష్ట్ర సర్పంచుల ఫోరమ్ ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్, ఎంపీటీసీ నత్తి లావణ్య బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, నేడు తూప్రాన్ మాజీ సర్పంచి శివమ్మ తన అనుచరులతో ఈటల రాజేందర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
బీఆర్ఎస్‌లో నైతిక విలువలు లేకపోవడంతో భారీగా నిరాశలో ఉన్నారు. వీరిలో శివమ్మ కూడా ఒకరు. ఇది ఇలానే కొనసాగితే బీఅర్ఎస్ పార్టీకి భారీ షాక్ తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఉద్యమ సమయం నుండి పార్టీ కోసం కష్టపడ్డ వారిని పట్టించుకోవడం లేదని పార్టీకి ప్రచారానికి దూరంగా చాలా మంది నిరాశలో ఉన్నారు.
త్వరలో భారీ చేరికలు..
ఉమ్మడి తూప్రాన్, మనోహరబాద్ మండలాల్లో త్వరలో భారీ చేరికలు ఉన్నట్టు సమాచారం. నేడు ఈటల రాజేందర్ ఈ ప్రాంతానికి రానున్న నేపథ్యంలో బీజేపీ గూటికి వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి.