BIG News: ప్రభుత్వానికి ‘హైడ్రా’ బూస్ట్..! డెసిషన్‌పై శభాష్ అంటున్న జనం

‘చెరువులు కబ్జా పెడితే భయపడాలి. నాలాలు ఆక్రమిస్తే గుండెలో వణుకు రావాలి.

Update: 2024-08-26 02:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘చెరువులు కబ్జా పెడితే భయపడాలి. నాలాలు ఆక్రమిస్తే గుండెలో వణుకు రావాలి. రోడ్లను ఆక్రమించుకొని అడ్డగోలుగా వ్యహరిస్తామంటే కుదరదు’ అంటూ సీఎం రేవంత్ ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించిన మాటలను, ఇప్పుడు హైడ్రా ద్వారా అమలు చేస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు చుట్టు పక్కన ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటల సంరక్షణకు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) అనే సంస్థ ద్వారా యాక్షన్ ప్లాన్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు.

కమిషనర్‌గా కీలకమైన వ్యక్తిని నియమించి రాజకీయాలకు అతీతంగా డ్రైవ్ కొనసాగించాలని లక్ష్యం పెట్టుకున్నారు. దీనిలో భాగంగానే అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను, పుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా ఆపరేషన్ ద్వారా కూల్చివేస్తున్నారు. నీటి నిల్వకు అడ్డంకిగా మారిన నిర్మాణాలన్నీ తొలగిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే హెచ్చరించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సరి కొత్తగా తెర మీదకు తీసుకువచ్చిన ఈ ఆపరేషన్‌పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.

మెజారిటీ పబ్లిక్ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సీఎం రేవంత్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా హైప్‌లోకి వెళ్లింది. సినీ నటుడు నాగార్జున‌కు చెందిన ఈ కన్వెన్షన్‌కు ఎలాంటి వెసులుబాటు ఇవ్వకుండానే రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నదంటూ ప్రత్యేక సెక్యూరిటీని ఏర్పాటు చేసి మరీ కూల్చారు. దీంతో సోషల్ మీడియాలో కాంగ్రెస్ సర్కారుపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

అక్రమ నిర్మాణాలు కూల్చాలని సీఎంకు రిక్వెస్టులు

‘అనాడు ప్రశ్నించాడు..ఈనాడు కూల్చేశాడు’ అంటూ సీఎం‌ను కొనియాడుతున్నారు. వాస్తవానికి ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడం అని 2014లో ప్రస్తుత సీఎం రేవంత్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే అసెంబ్లీలో లేవనెత్తారు. కానీ గత ప్రభుత్వం దీని మీద పదేండ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక ఇదే తరహాలో అన్ని రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, బడా వ్యక్తుల అక్రమ నిర్మాణాలు, కట్టడాలనూ కూల్చాలని ప్రజల నుంచి సీఎంకు రిక్వెస్టులు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో విన్నపించడమే కాకుండా పలువురు హైడ్రా అధికారులకూ ఫిర్యాదు చేస్తున్నారు. హైడ్రా ఎపిసోడ్ తమకు మంచి మైలేజ్‌ను తీసుకొచ్చిందని కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు. హైడ్రా ఒక్కొక్క ఫిర్యాదు, కేసును పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకుంటున్నదని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి వెల్లడించారు.

అన్ని జిల్లాల్లోనూ హైడ్రా అవసరమే..?

గ్రేటర్ పరిధిలో హైడ్రా యాక్షన్ ప్లాన్ మొదలయ్యాక, అన్ని జిల్లాల్లోనూ దీని కార్యకలాపాలను విస్తరింపచేయాలని రిక్వెస్టులు పెరుగుతున్నాయి. కొందరు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో సీఎం‌ను కోరుతుండగా, మరి కొందరు హైడ్రా ఉన్నతాధికారులను రిక్వెస్టు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కూడా ఇదే అంశంపై సీఎం రేవంత్‌కు ప్రత్యేక లేఖ రాశారు. సామాన్య ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్ధి విభాగ నాయకులు, పర్యావరణ, సామాజిక వేత్తలు, సీనియర్ రాజకీయ నాయకులూ జిల్లాల్లో హైడ్రా‌ను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

బీఆర్ఎస్ పాలనలో గ్రేటర్ హైదరాబాదే కాకుండా, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ వంటి పట్టణాల్లోనూ ఆక్రమణలు ఎక్కువయ్యాయని, వాటిన్నింటిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు హైడ్రా అవసరమే అంటూ వినతులు వస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వివరించాయి. దీనిపై సీఎం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే జిల్లాల్లోనూ హైడ్రా అమలుపై సీఎం ఓ క్లారిటీ ఇవ్వనున్నారని ఓ అధికారి తెలిపారు. ఇక హైడ్రా పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు ర్యాలీలు నిర్వహించాయి. గండిపేట్ వెల్ఫేర్ అసోసియేషన్ హైడ్రా యాక్టివిటీస్‌కు వెల్‌కమ్ చెప్తూ ఓ ప్రత్యేకమైన వాక్‌నూ నిర్వహించడం గమనార్హం.

కొన్ని సమస్యలు..

హైడ్రా అమలు తీరు మంచి ఉద్దేశమే అయినప్పటికీ, కొంత మంది సామాన్యులకు ఇది ఇబ్బందిగా మారింది. గతంలో ఎఫ్​టీ‌ఎల్, బఫర్ జోన్లు అని తెలియక భూములు కొనుగోలు చేసినోళ్లు, మధ్యవర్తుల ద్వారా మోసపోయిన ప్రజలు, కొందరు అధికారులు, దళారుల నడుమ ఇరుక్కుపోయిన వ్యక్తులకు హైడ్రా ఆపరేషన్ సమస్య తెచ్చి పెట్టింది. ఇలాంటి కేసులను ప్రత్యేకంగా పరిశీలించి పేదలకు ఆదుకోవాలని కమ్యూనిస్టు పార్టీ నేతలు కోరుతున్నారు. ఇక ఆక్రమణలపై నోటీసులు ఇచ్చి కూల్చితే బెటర్ అంటూ ఆయా నేతలు సర్కారుకు వివరిస్తున్నారు. తెలిసి తప్పుచేసినోళ్లపై చర్యలు తీసుకుంటూనే, తెలియక మోసపోయిన పేదలకు ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉన్నదంటూ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

ఆఫీసర్లపై చర్యలేవీ..

కబ్జాలు, ఆక్రమణలు తొలగిస్తున్న హైడ్రాపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే, గతంలో ఈ దారుణాలకు కారణమైన ఆఫీసర్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆయా ఆఫీసర్లకు ఇవి నిబంధనలకు విరుద్ధమంటూ గతంలో తెలియదా? లేక తెలిసి మౌనంగా ఉన్నారా? అంటూ పబ్లిక్ మండిపడుతున్నారు. హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులు, శాటిలైట్ ద్వారా గుర్తించిన ఆక్రమణలపై పూర్తి స్థాయిలో ఎంక్వయిరీ చేసి, నిర్మాణాలను కూల్చివేస్తూనే వాటికి పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లపైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని పబ్లిక్ సీఎంకు విన్నపిస్తున్నారు. ఆయా అధికారులు ఎక్కడున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే హైడ్రాలో సీరియస్‌నెస్ కనిపిస్తుందని పేర్కొంటున్నారు. ఆ తర్వాత ఇతర ఏ అధికారి అలాంటి కార్యకలాపాలకు పాల్పడాలంటే భయపడాలని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గడిచిన మూడు రోజులుగా పేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రా, రీల్స్, తదితర సోషల్ మీడియా‌లో హైడ్రా‌నే హాట్ టాపిక్‌గా మారింది.


Similar News