BIG News: నగరంలో కాన్‌స్టిట్యూషన్ క్లబ్.. నిర్మాణానికి సర్కారు కసరత్తు

హైదరాబాద్‌లోని ఆదర్శ్‌నగర్‌లో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మెజార్టీ క్వార్టర్స్ నిరుపయోగంగా ఉన్నాయి.

Update: 2024-08-23 02:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని ఆదర్శ్‌నగర్‌లో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మెజార్టీ క్వార్టర్స్ నిరుపయోగంగా ఉన్నాయి. అందులో కొన్ని బిల్డింగ్స్ సామర్థ్యం సరిగా లేదు. దీనితో వాటిని కూల్చి, కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ క్లబ్ వివిధ సామాజిక, రాజకీయ అంశాలపై నిర్వహించే సెమినార్లు, చర్చలకు హాజరయ్యేందుకు ఆఫీసర్లు, రాజకీయ నాయకులకు సౌకర్యంగా ఉంటుందనే అభిప్రాయం ప్రభుత్వంలో కనిపిస్తున్నది.

బడ్జెట్‌లో రూ.30 కోట్లు కేటాయింపు

గత ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాంతంలో కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నిర్మిస్తామని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఆ ప్రాంతంలో హెచ్‌వోడీల బిల్డింగ్ నిర్మించాలని కొత్త ప్రతిపాదన తెరమీదకు తీసుకొచ్చారు. అదీ జరగలేదు. ప్రస్తుత సర్కారు కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నిర్మించాలనే నిర్ణయానికి వచ్చింది. అందుకోసం 2024–25 బడ్జెట్‌లో సుమారు రూ.30 కోట్లు కేటాయించింది. సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతంలో క్లబ్ ఏర్పాటుతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల కోసం జిమ్, స్విమింగ్ పూల్, లైబ్రరీలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

క్లబ్ నిర్మాణం కోసం సీఎం భూమి పూజ!

కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణం కోసం భూమి పూజ చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం పూజ చేశాకనే.. నిరుపయోగ బిల్డింగుల కూల్చివేతలు మొదలవుతాయని సమాచారం. అయితే, బిల్డింగ్స్‌ను కూల్చివేసే ముందు ప్రతి బిల్డింగ్ సామర్థ్యంపై రిపోర్టులు తయారు చేయాలని భావిస్తున్నారు. లేకపోతే బీఆర్ఎస్‌కు ‌వచ్చినట్టుగా అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుందని సర్కారు భావిస్తోంది. సెక్రెటేరియట్ బిల్డింగ్స్‌ను అనవసరంగా కూల్చారనే అపవాదు ఆ సమయంలో బీఆర్ఎస్‌ను కుదిపేసింది. అందుకే.. అలా కాకుండా ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలని ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను జిల్లా కలెక్టర్, ఆర్అండ్‌బీ, అసెంబ్లీ ఆఫీసర్లు పరిశీలించారు. బిల్డింగ్ నిర్మాణాల సామర్థ్యాలను తనిఖీ చేశారు. వీరిచ్చే రిపోర్టు అధారంగా అక్కడ ఎప్పుడు భూమి పూజ చేయాలనే అంశం ఫైనల్ అవుతుందని ఆఫీసర్లు వెల్లడించారు. 

Tags:    

Similar News