BIG News: అన్నదాతలకు గుడ్ న్యూస్.. వరి బోనస్‌కు రూ.2 వేల కోట్లు..!

సన్నాలు పండించే రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

Update: 2024-08-13 02:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సన్నాలు పండించే రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దీనిని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ సంవత్సరం నుంచే దీనిని అమలు చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో బోనస్‌ను ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇందుకోసం 33 రకాల సన్న రకం వరి ధాన్యాల వివరాలను సైతం వెల్లడించింది. ఈసారి వానాకాలం సీజన్‌లో ఎన్ని లక్షల టన్నుల వరి ఉత్పత్తి అవుతుంది?.. ఇందులో నేరుగా రైస్ మిల్లర్లకు విక్రయించేదెంత?.. సొంత అవసరాలకు ఉంచుకునేదెంత?.. చివరకు కొనుగోలు కేంద్రాలకు వచ్చేదెంత?.. అని వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలేసుకుంటున్నారు. గత వానాకాలంలో వరి దిగుబడితో పోల్చుకుని అంచనాలను సిద్ధం చేస్తున్నారు.

గతేడాది దాదాపు 47 లక్షల టన్నులు!

గతేడాది వానాకాలం సీజన్‌లో మొత్తంగా 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఐకేపీ (కొనుగోలు కేంద్రాలకు) సెంటర్లకు దాదాపు 47 లక్షల టన్నులకు పైగా ధాన్యం వచ్చినట్టు వ్యవసాయ అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి ఆగస్టు 7వ తేదీ నాటికి 25.59 లక్షల ఎకరాల్లో వరి నాళ్లు పూర్తయ్యాయి. గతేడాది ఇదే సమయానికి ఇది 34.37 లక్షల ఎకరాలుగా ఉన్నది. గతేడాది రుతుపవనాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా, సాగునీటి సౌకర్యం అందకపోయినా 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. కానీ ఈసారి మాత్రం సాధారణ సాగుతో పోలిస్తే 44.47% మాత్రమే కార్యరూపం దాల్చడంతో ఉత్పత్తి సైతం తగ్గిపోతుందనే అంచనాలు నెలకొన్నాయి. గతేడాది వానాకాలం వరి దిగుబడి అంచనా 99.31 లక్షల టన్నులుగా ఉన్నప్పటికీ అందులో సగం మాత్రమే సాధ్యమైంది. ఈసారి సైతం అదే తీరులో ఉండొచ్చని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు.

సాగులో తేడా!

గతేడాది ఆగస్టు 7వ తేదీ నాటికి 34.37 లక్షల ఎకరాల్లో వరి సాగులోకి వచ్చింది. ఈసారి మాత్రం అది 25.58 లక్షల ఎకరాలకే పరిమితమైంది. సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున (కనీస మద్దతు ధరకు అదనంగా) రైతులకు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చినా సాగు విస్తీర్ణం తగ్గడం గమనార్హం. ఈ నెల చివరకు మరికొన్ని ఎకరాలు సాగులోకి వచ్చినా గతేడాది సాగైన (65 లక్షల ఎకరాలు) స్థాయికి చేరుకోకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. గరిష్టంగా 35 లక్షల ఎకరాలకు మించి వరి సాగు ఉండదనే ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీంతో మొత్తం ఉత్పత్తి సైతం గతేడాది కన్నా తగ్గే అవకాశమున్నది. గతేడాది ఐకేపీ కేంద్రాలకు 47.34 లక్షల టన్నుల ధాన్యం వచ్చింది. ఈసారి 40 లక్షల టన్నులు దాటకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో బోనస్‌ కోసం రూ.2 వేల కోట్లకు మించి అవసరం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

రైతు భరోసాకు రూ.ఐదున్నర వేల కోట్లు!

రైతులకు రైతుబంధు స్థానంలో రైతుభరోసాను అమలు చేయాల్సి ఉన్నందున అందుకోసం ప్రభుత్వం నిధులు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. రైతు భరోసా విధివిధానాలను కేబినెట్ సబ్ కమిటీ ఫైనల్ చేసిన తర్వాత లబ్ధిదారుల సంఖ్య, ఖర్చుపై స్పష్టత వస్తుంది. సాగుచేసే భూములకు మాత్రమే రైతుభరోసా ఇస్తామని, కొండలు, గుట్టలు, రాళ్లురప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు... ఇలాంటి భూములన్నింటినీ మినహాయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ ఆంక్షల నేపథ్యంలో ఈ పథకానికి గతంలో (రైతుబంధుకు) కేటాయించిన నిధులకు మించి అవసరం ఏర్పడకపోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. కనీస స్థాయిలో రూ.ఐదున్నర వేల కోట్లు ఖర్చు కావొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వరికి ఇచ్చే బోనస్‌ను సైతం కలుపుకుంటే అత్యధికంగా ఏడున్నర వేల కోట్లు అవసరం కావొచ్చని అంచనా.

బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు

రాష్ట్ర బడ్జెట్‌లో ఈసారి వ్యవసాయ రంగానికి గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వం రూ.72 వేల కోట్లను కేటాయించింది. ఇందులో రుణమాఫీ సైతం కలిసి ఉన్నది. ఇప్పటివరకు అధికారులు వేసిన లెక్కల ప్రకారం రుణమాఫీకి మూడు విడతల్లో రూ.18 వేల కోట్లు ఖర్చుకానున్నది. రైతుభరోసా, వరికి బోనస్ రూపంలో అదనంగా మరో రూ.7,500 కోట్లు (గరిష్ట స్థాయిలో) ఖర్చు కావచ్చు. ఇక రైతుబీమా స్కీమ్‌కు సైతం ఇంకో రూ.1,500 కోట్లు ప్రభుత్వం ప్రీమియం రూపంలో ఎల్ఐసీకి కట్టనున్నది. ఈ నాలుగు రూపాల్లో రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.27 వేల కోట్లను ఖర్చు చేయనున్నది.

BIG News: వరి బోనస్‌కు రూ.2 వేల కోట్లు! క్వింటాల్‌కు రూ.500 పక్కాఇక రూ.2 లక్షల రుణమాఫీలో కొద్దిమంది రైతాంగానికి టెక్నికల్ కారణాలతో (ఆధార్, బ్యాంకు ఖాతాల మిస్‌మ్యాచ్) ప్రస్తుతానికి జమ కాకపోయినా గ్రీవెన్స్ సమయంలో ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నందున అది అదనంగా రూ.నాలుగైదు వేల కోట్లు ఉండొచ్చని ప్రాథమిక అంచనా. రుణమాఫీ మినహా రైతుభరోసా, రైతుబీమా, వరికి బోనస్ తదితరాలన్నింటికీ ప్రభుత్వం నిధులను సమీకరించుకోవడం అనివార్యంగా మారింది. అక్టోబరు మొదలు డిసెంబరు వరకు వీటికి అందించేందుకు నిధులను సిద్ధం చేసుకోక తప్పదు. దీనికి అనుగుణంగా వ్యవసాయ శాఖ ఇప్పటి నుంచి ఖరీఫ్ (వానాకాలం) పంటకు సన్నాలు సాగుచేసే రైతులకు ఎంత ఖర్చవుతుందనే లెక్కలను అంచనా వేస్తున్నది. ఈ నెల చివరకు వరి నారుమళ్ల ప్రక్రియ పూర్తయితే ఈ అంచనాల్లో కొన్ని మార్పులు జరిగి ఇంకొంత స్పష్టత వచ్చే చాన్స్ ఉన్నది.

Tags:    

Similar News