భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఎవరికి? పావులు కదుపుతున్న సీనియర్ నేతలు
లోక్‌సభ ఎన్నికల దగ్గర పడుతుండటంతో బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. పార్టీ నుంచి కేవలం భువనగిరి ఎంపీ టికెట్ కోసం సీనియర్ నేతలు పోటీ పడుతున్నట్టు సమాచారం.
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల దగ్గర పడుతుండటంతో బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. పార్టీ నుంచి కేవలం భువనగిరి ఎంపీ టికెట్ కోసం సీనియర్ నేతలు పోటీ పడుతున్నట్టు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ గాలి బాగా విస్తుందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో భువనగిరిలో మాత్రం బీఆర్ఎస్‌కు బలమైన స్థానం కావడంతో ఆశావాహులు ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఎంపీగా బూర నర్సయ్య గౌడ్ గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఎంపీ టికెట్ కోసం పలువురు నేతలు పావులు కదుపుతున్నారు.
ఆశిస్తున్న నేతలు వీరే
భువనగిరి తప్ప మిగిత సెగ్మెంట్లో మాత్రం పోటిగా బీఆర్ఎస్ అభ్యర్థులు మొగ్గు చూపడం లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మొదటి రెండు ప్లేస్‌లు మెజార్టీ వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్ ఆశావాహులకు భువనగిరి ఎంపీ సీటు హాట్ సీట్‌గా మారింది. ఈ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి, మరో ఉద్యమకారుడు చెరుకు సుధాకర్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన క్యామ మల్లేష్, గొంగిడి సునీత, కర్నె ప్రభాకర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పొటి పడుతున్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ చేరిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సైతం ఈ టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఈ స్థానం ఎంపీ టికెట్ పై అధిష్టానానికి తలనొప్పిగా మారింది. గత తప్పిదాలను పునరావృతం కాకుండా అధిష్టానం జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ కసరత్తు ప్రారంభించింది.
బీసీ, రెడ్డి వర్గానికి చెందిన నేతలు!
టికెట్ కోసం సీనియర్ నేతలు తీవ్రంగా పావులు కదుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీ, రెడ్డి వర్గానికి సంబంధించిన నాయకులకు ఏరియాపై పట్టు ఉంది. అక్కడే ఎన్నో ఏళ్లుగా వారు రాజకీయంగా పాగా వేశారు. దీంతో కారు గుర్తుపై ఎవరికి టికెట్ దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది.