ఎమ్మెల్యే క్వార్టర్స్ అడ్డాగా ఎన్నికలపై జోరుగా బెట్టింగులు!

కర్ణాటక ఎన్నికలు మన రాష్ట్రంలోని బెట్టింగ్​రాయుళ్లకు కాసుల పంటగా మారాయి.

Update: 2023-05-04 03:29 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : కర్ణాటక ఎన్నికలు మన రాష్ట్రంలోని బెట్టింగ్​రాయుళ్లకు కాసుల పంటగా మారాయి. అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ముఖ్య నేతలు పోటీ పడే స్థానాల్లో గెలుపెవరిది? మెజారిటీ ఎంత వస్తుంది? అనే అంశాలపై ఇక్కడ రూ. లక్షల్లో బెట్టింగులు కాస్తున్నట్టు సమాచారం. ఇదికాస్త పోలీసులకు తెలియడంతో ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు. ప్రధానంగా రియల్టర్లు, బడా వ్యాపారులు, రాజకీయ పార్టీల ద్వితీయ శ్రేణి నేతలు పందేలు కాస్తున్నట్టు తమ వద్ద సమాచారం ఉందని కూడా పేర్కొంటున్నారు. రాష్ర్టంలోని పలు ఫాంహౌసులు, అపార్ట్​మెంట్లతో పాటు పలువురు తమ ఇళ్లను అడ్డాగా చేసుకుని దందా నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు.

ఇందులో రాయలసీమకు చెందిన వారే జోరుగా బెట్టింగుల దందా నడుపుతున్నట్టు తెలుస్తుంది. కర్ణాటకలో గత ఎన్నికల్లో బీజేపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి కూడా ఆ పార్టీకి గెలుపు నల్లేరుపై నడకేనని అంతా అనుకుంటున్నారు. అయితే, రాహుల్​గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు కావటం.. ఆయనను అధికారిక నివాసం నుంచి బయటకు పంపించి వేయటంతో కాంగ్రెస్‌కు ఆ రాష్ర్టంలో కొంతసానుభూతి వచ్చింది. అదే సమయంలో వేర్వేరు కారణాలతో బీజీపీలోని కొందరు ప్రముఖ నేతలు హస్తంలోకి వెళ్లడంతో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది.

సర్వేలతో ఉత్కంఠ

కర్ణాటక ఎన్నికల ఫలితాలపై వివిధ సంస్థల సర్వే నివేదికలు కూడా ఉత్కంఠను పెంచుతున్నాయి. కొన్ని సర్వేలు ఈసారి కూడా బీజేపీదే విజయం అని వెల్లడిస్తున్నాయి. మరికొన్ని సర్వేలు కర్ణాటక ‘హస్త’గతం కావటం ఖాయమని పేర్కొంటున్నాయి. ఇదే బెట్టింగ్​రాయుళ్లకు అవకాశంగా మారింది. బీజేపీపై వంద రూపాయలు పందెంగా పెట్టి గెలిస్తే రూ.105 , కాంగ్రెస్​పై రూ. 100 పెట్టి గెలిస్తే రూ. 103 ఆఫర్​ను ఇస్తున్నట్టు తెలిసింది. పోలీసువర్గాల ద్వారా తెలిసిన ప్రకారం క్రికెట్​బెట్టింగులు నిర్వహించే గ్యాంగులతోపాటు ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నేతలకు కూడా బెట్టింగులు కడుతున్నారు. ఇలా పందేలు స్వీకరిస్తున్న వారిలో రాయలసీమకు చెందిన వారు ముందు వరుసలో ఉన్నట్టు తెలిసింది.

పట్టుబడకుండా జాగ్రత్తలు..

ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు చేసే వారు పట్టుబడకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. కొందరు ఎమ్మెల్యే క్వార్టర్స్​ను కేంద్రంగా చేసుకుని దందా నడుపుతుంటే.. మరికొందరు తమ సొంత ఫాంహౌసులు, అపార్ట్​మెంట్లలో అద్దె ఫ్లాట్లలో ఉంటూ కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఇక క్రికెట్​బెట్టింగుల్లో వాడినట్టుగా కంప్యూటర్లను వినియోగించడంలేదని తెలిసింది. బెట్టింగులు కాస్తున్న వారి పేర్లు.. పందెంగా ఎంత మొత్తం పెట్టారు? అనే వివరాలు కోడ్ భాషలో డైరీల్లో రాసి పెట్టుకుంటున్నట్టు తెలిసింది.

వీలైనంత మేరకు నగదులోనే లావాదేవీలు జరుపుతున్నట్టు తెలియవచ్చింది. దీనిపై నిఘా విభాగాలకు చెందిన పోలీసు అధికారులతో మాట్లాడగా బెట్టింగులపై తమకు సమాచారం అందిందని..లా అండ్ ఆర్డర్‌తో పాటు టాస్క్​ఫోర్స్, స్పెషల్​టాస్క్​ఫోర్స్, ఎస్వోటీ తదితర బృందాలకు సమాచారం కూడా అందజేశామన్నారు. కట్టుదిట్టమైన నిఘా పెట్టిన నేపథ్యంలో క్రికెట్​బెట్టింగ్​గ్యాంగులను పట్టుకున్నట్టుగా ఈ ముఠాలను కూడా పట్టుకుంటామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News