కాయ్ రాజా కాయ్.. తెలంగాణ ఎన్నికలపై ఊహించని రేంజ్‌లో బెట్టింగ్స్..!
క్రికెట్ బెట్టింగ్‌కే కాదు.. ఎన్నికల్లో ప్రధాన పార్టీల సీట్ల కేటాయింపు ఎవరికి, గెలుపోటములు, ఎన్నికల ఫలితాలు, మెజారిటీలపై బెట్టింగ్‌కు పెట్టింది పేరైన కడప
దిశ, కడప ప్రతినిధి: క్రికెట్ బెట్టింగ్‌కే కాదు.. ఎన్నికల్లో ప్రధాన పార్టీల సీట్ల కేటాయింపు ఎవరికి, గెలుపోటములు, ఎన్నికల ఫలితాలు, మెజారిటీలపై బెట్టింగ్‌కు పెట్టింది పేరైన కడప జిల్లాలో తెలంగాణ ఎన్నికలపై కూడా జోరుగా బెట్టింగ్ సాగుతోంది. పోలింగ్‌కు వారం ముందు నుంచే జిల్లాలో కాయ్ రాజా కాయ్ అంటూ కోట్ల రూపాయలు బెట్టింగ్ సాగిస్తున్నారు. పోలింగ్ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెళ్లడవడంతో బెట్టింగ్ జోరు కాస్త తగ్గినా కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు, బీజేపీకి ఎన్ని సీట్లు, హంగ్‌తో బీఆర్ఎస్ సీఎం పదవి చేపడుతుంది అని.. ఇలా బెట్టింగ్ సాగిస్తున్నారు. లక్షలకు లక్షలకు కాస్తున్న పందేలు జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయల్లో జరిగాయని అంచనా వేస్తున్నారు.
మ్యాజిక్ ఫిగర్‌పై జోరుగా..
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు వస్తాయి అన్నదానిపై కొందరు, అన్ని రావు అని మరికొందరు బెట్టింగ్ కాస్తున్నారు. వీరి మధ్య కొన్నిచోట్ల రూపాయికి రూపాయి బెట్టింగ్ నడుస్తోంది. ప్రొద్దుటూరులో రూపాయికి మూడు రూపాయలుగా కూడు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలు రావని రూపాయి కాస్తే కచ్చితంగా 60 సీట్లు వస్తాయని మూడు రూపాయలు కాస్తున్నట్లు సమాచారం. ఇతర ప్రాంతాల్లో ఇదే బెట్టింగ్ రూపాయికి రూపాయిగా సాగుతుంది. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌తో పాటు బీజేపీకి పది సీట్లు వస్తాయని కొందరు పందేలు కడుతున్నారు.
వీటితోపాటు ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ పార్టీనే సీఎం పీఠం దక్కించుకంటుందని, ఇతర పార్టీలతో కలుపుకొని హంగ్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుందని పలుచోట్ల పందేలు సాగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ మధ్య ఈ బెట్టింగ్ జోరు సాగుతోంది. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లో బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువగా ఉన్నారు. బెట్టింగ్ కాసే వారిలో కొందరు రాజకీయ నాయకులు కూడా ఉండం విశేషం. సాధారణ ఎన్నికల్లో ప్రతిసారి జిల్లాలోని ప్రధాన రాజకీయ నాయకులు కొందరు కోట్ల రూపాయల బెట్టింగ్ కాసేవారు. అయితే ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రభావమో ఏమో కానీ ప్రధాన నాయకులు బెట్టింగ్‌లో ఉన్నట్లు ట్లు కనిపించడం లేదు. కానీ ద్వితీయ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కొందరు బెట్టింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
భీమవరం నుంచి..
కడప జిల్లాలో జరుగుతున్న తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కోస్తా జిల్లాలు, భీమవరానికి చెందిన వారు బెట్టింగ్ పెడుతున్నారు. భీమవరం ప్రాంతంలో కోడి పందేలు, ఎలక్షన్లపై బెట్టింగ్ బాగా సాగుతుంది. ఈ ప్రాంతం నుంచి కడప జిల్లాలో జరిగే ఎన్నికల ఫలితాలపైనా, మెజార్టీపైనా బెట్టింగ్ పెట్టడం కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల ఫలితాలపైనా భీమవరం ప్రాంతానికి చెందిన వారు కడప జిల్లాలో బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ ఒప్పందాల ఇరువురి మధ్య మూడో వ్యక్తి ఉంటారు.
ఆ మూడో వ్యక్తికి ఇరువురు బెట్టింగ్ మేరకు అమౌంట్ చెల్లిస్తే బెట్టింగ్ లో ఎవరు గెలిస్తే వారికి ఆ డబ్బు ముట్ట చెబుతారు. ఇందుకోసం మధ్యవర్తికి కొంత పర్సంటేజీ ఇస్తుంటారు. ఇలా సాగే బెట్టింగ్ క్రికెట్ నుంచి ఎన్నికల ఫలితాలు దాకా ఆయా సందర్భాల్లో జిల్లాలో జోరుగా సాగుతూ ఉంటుంది .ఇప్పుడు తెలంగాణపై కాసిన బెట్టింగ్ లో ఎవరు మునుగుతారో !ఎవరు తేలుతారో !! ఎవరి అంచనాలు తలకిందులు అవుతాయోనన్న ఉత్కంఠ బెట్టి రాయుళ్లలో నెలకొంది.