హాంకాంగ్ లో బతుకమ్మ సంబరాలు

తెలంగాణ పూల పండుగ బతుకమ్మ పరిమళం విదేశాల్లోనూ గుభాళిస్తుంది.

Update: 2024-10-09 06:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పూల పండుగ బతుకమ్మ పరిమళం విదేశాల్లోనూ గుభాళిస్తుంది. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు తెలుగు లోగిళ్లతో పాటు విదేశాలలోనూ ఘనంగా జరుగుతున్నాయి. హాంకాంగ్ దేశంలో తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకున్నారు. హాంకాంగ్ సముద్ర తీరాన లాన్తావ్ ఐలాండ్ తుంగ్ చుంగ్ ప్రొమెనెడ్ వద్ద బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ పెద్దలతో పాటు పిల్లలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ ఆటపాటలతో సముద్ర తీరం బతుకమ్మ శోభను సంతరించుకుంది.

బతుకమ్మ ఆట- పాటల తర్వాత విందు భోజనం ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండగ ఘనంగా జరుపుకుున్నామని ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఆనందం తెలిపారు. బతుకమ్మతో పాటు దసరా పండుగ కూడా ఇక్కడ ఘనంగా జరుపుకుంటామని, బతుకమ్మ పండుగలో తెలంగాణ ఆడపడుచులతో పాటు తెలుగేతరుు కూడా కలిసి ఆడతారన్నారు. దసరా నవరాత్రుల్లో లలితా పారాయణం, బొమ్మల కొలువు, పేరంటాలను నిర్వహిస్తామని, పండుగకు పదిహేను రోజుల నుంచి కోలాహలం ఉంటుందని చెప్పారు. స్నేహితులు, బంధువుల రాకపోకలతో పండగ వాతావరణం నెలకొంటుందని వెల్లడించారు. అటు దుబాయ్ లో ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం (ఈటీసీఏ) ఆధ్వర్యంలో, ఆల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో, ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని నార్త్ కరోలినా కాంకార్డ్ కానన్ రన్ ప్రన్థమ్‌లో, వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.

Similar News