850 ఏండ్ల ఆఫ్రికా వృక్షం.. మేఫెయిర్ విల్లాస్‌లో ప్రత్యక్ష్యం
అభిరుచి ఉండాలే గానీ.. కొండ మీద కోతిని తీసుకురాలేరా? ఆశించిన వస్తువు ఎక్కడ ఉన్నా తెచ్చుకోవడం పెద్ద లెక్కలేం కాదు. అరుదైన కానుకలు ఇచ్చుకోవడం రాజులకే చెల్లింది.
దిశ, తెలంగాణ బ్యూరో: అభిరుచి ఉండాలే గానీ.. కొండ మీద కోతిని తీసుకురాలేరా? ఆశించిన వస్తువు ఎక్కడ ఉన్నా తెచ్చుకోవడం పెద్ద లెక్కలేం కాదు. అరుదైన కానుకలు ఇచ్చుకోవడం రాజులకే చెల్లింది. ఎక్కడి నుంచో హైదరాబాద్కి ఓ మమ్మీ వచ్చింది. గోల్కొండ కోటకి ఆఫ్రికా చెట్టు వచ్చింది. ఐతే నాటి రాజులకే సాధ్యమా? ఆసక్తి ఉన్న ఓ వృక్ష ప్రేమికుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ఆఫ్రికా నుంచి 850 ఏండ్ల వయసున్న వృక్షాన్ని హైదరాబాద్కి తీసుకొచ్చారు. అంతే కాదు.. సక్సెస్ ఫుల్ గా దాన్ని నాటించారు. బతికేటట్లు చేసి విజయం సాధించారు. ఆ చెట్టు పేరు బావోబాబ్ ట్రీ. బొటానికల్ పేరు అడాన్సోనియా డిజిటాటా. దీన్ని ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకున్నారు. తెల్లాపూర్ గ్రీన్ మార్క్ మే ఫెయిర్ విల్లాస్ లో నాటించారు.
ఇప్పుడిది బతికింది. ఇక్కడి వాతావరణంలోనూ మనుగడ సాధిస్తుందని రుజువైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి జి.కల్యాణ్రెడ్డి ఈ వృక్షాన్ని ఆఫ్రికా నుంచి అత్యంత జాగ్రత్తతో తీసుకొచ్చారు. కంటెయినర్ లో దీన్ని రవాణా చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని విల్లాస్ ఏరియాలో నాటారు. ఇది 40, 50 మంది కూర్చోవడానికి సరిపోయేంత విస్తీర్ణంతో పెరుగుతుంది. గుహ మాదిరిగా చేసుకొని అందులో సేద తీరే అవకాశమున్నది. ఈ వృక్షాలు వెస్ట్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, మడగాస్కర్ దేశాల్లోనే కనిపిస్తాయి. వీటిని అక్కడి ప్రజలు దేవతగా కొలుస్తారు. ఔషద గుణాలు కలిగిన ఈ వృక్షం కావడంతో పూజలు చేస్తుంటారు.
ఏడాది కాలం పాటు ఆకులు లేకుండా ఉండే చెట్టు. దాని మూలాలను గాలిలో విసిరినట్లుగా 'తలక్రిందులుగా' కనిపిస్తుంది. దీని సగటు జీవితం 2000-2500 సంవత్సరాల కంటే ఎక్కువ. సంప్రదాయకంగా ఆరోగ్య ప్రదాతగా నిలుస్తుంది. కల్పవృక్ష చెట్టు ఆకులు అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని చెబుతున్నారు. కాల్షియం లోపాలలో గొప్పగా సహాయపడతుంది. గతంలో టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్‌గా కొందరు రాజులకు అందాయి. దేశంలో ఇప్పటి వరకు 60 చెట్ల వరకు ఉన్నాయని అంచనా. తెల్లాపూర్‌లోనూ మరొకటి కొలువుదీరింది. తెల్లాపూర్ ఏరియాలో ఈ వృక్షం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.