ఇన్నాళ్లు ప్రజాకంటక పాలన సాగిందని అంగీకరిస్తున్నారా?: బండి సంజయ్

సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.

Update: 2024-09-12 11:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా ఉందని, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టుడే ప్రజాపాలననా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో ఇన్నాళ్లు ప్రజాకంటక పాలన కొనసాగినట్లేనని ఈ నిర్ణయంతో కాంగ్రెస్ అంగీకరించినట్లేనా? అని ప్రశ్నించారు. ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బండి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడమే ప్రజా పాలనా? అని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నడ్డి విరగ్గొట్టారని, ఉద్యోగులకు ఇస్తామన్న టీఏ, డీఏ, పీఆర్సీ ఇవ్వకుండా మోసం చేశారని, రోడ్లమీద పసిపిల్లలను కుక్కలు పీక్కుతింటున్నా పట్టించుకోలేదని, ఇదేనా ప్రజా పాలనా? అని నిలదీశారు. హామీలపై ప్రజలు నిలదీస్తుంటే వాళ్ల దృష్టిని మళ్లించేందుకు హైడ్రా పేరుతో డ్రామాలడటమే ప్రజాపాలనా అని అన్నారు. తాము హైడ్రాకు వ్యతిరేకం కాదని కానీ పేద, మధ్యతరగతి ఇండ్ల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బండి స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ దేశం వదిలి వెళ్లిపోవాలి..

రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి స్వదేశంపై, ఎన్నికల సంఘంపై విమర్శలు చేయడం సరికాదని బండి సంజయ్ అన్నారు. భారత ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించడం వల్లే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అని ప్రశ్నించారు. ఆయనకు ఈ దేశ చట్టాలు, న్యాయస్థానాలు, ఎన్నికల వ్యవస్థపై నమ్మకం లేకపోవడం సిగ్గుచేటన్నారు. సిక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత రాహుల్ గాంధీకి లేనేలేదన్నారు. ఐఎన్‌సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదని, ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని సెటైర్ వేశారు. దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తున్న రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో దేశం వదిలి వెళ్లాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నానని బండి సంజయ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News