సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ
అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకుపైగా పంట దెబ్బతిన్నట్లు తమకు ప్రాథమిక సమాచారం అందిందని, దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు.
దిశ, తెలంగాణ బ్యూరో: అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకుపైగా పంట దెబ్బతిన్నట్లు తమకు ప్రాథమిక సమాచారం అందిందని, దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో దాదాపు 13 జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్టుగా ప్రాథమికంగా సమాచారం అందిందన్నారు. మొక్కజొన్న, శనగ, మిర్చి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. 40వేల ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్రంలో ఇప్పటి వరకు సమగ్ర పంటల బీమా పథకాన్ని రూపొందించకపోవడం సిగ్గుచేటని బండి విమర్శలు చేశారు.
పంటనష్టం తేల్చే విషయంలో రాష్ట్ర పభుత్వ చర్యలు చాలా ఉదాసీనంగా ఉన్నాయని, మంత్రుల బృందం కేవలం వికారాబాద్ జిల్లాలోనే పర్యటించడం రైతులపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోందని చురకలంటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రానికి వర్తింపజేస్తే రైతులకు వెంటనే పరిహారం అందించే వీలుండేదని, కానీ కేంద్రానికి పేరొస్తుందనే అక్కసుతో ఈ పథకాన్ని రాష్ట్రానికి వర్తింపజేయకపోవడం వల్ల రైతులు నష్టపోయారని లేఖలో పేర్కొన్నారు. రైతాంగానికి అవసరమైన యూరియా సరఫరాలో వైఫల్యం, కౌలు రైతులకు ఎటువంటి ఆర్థిక భరోసా లేకపోవడం వల్లే రైతాంగం ఇంతటి దుస్థితిని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తంచేశారు. అకాల వర్షంతో నష్టపోయిన పంటను అంచనా వేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, కమిటీలు, సర్వేలు, నివేదికల పేరుతో తాత్సారం చేయొద్దని బండి డిమాండ్ చేశారు.
నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం చెల్లించాలన్నారు. రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు అందిస్తామని ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలని బండి డిమాండ్ చేశారు. కేవలం రైతుబంధు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, రైతుబంధు అందక భూమి సేద్యం చేస్తూ చితికిపోతున్న 14 లక్షల మంది కౌలురైతులను ఆదుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయకుండా రైతుల నోట్లో మట్టికొడుతుండటం క్షమించరాని నేరమని బండి ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.