MLC కవితకు బండి సంజయ్‌ను క్షమాపణ చెప్పాలి: CPI

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

Update: 2023-03-11 13:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. మహిళల వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, బహిరంగంగా మాట్లాడలేని పదాలతో మాట్లాడిన బండి సంజయ్‌పై మహిళలను కించపరిచే వారికి ఎలాంటి సెక్షన్లు వర్తిస్తాయో అలాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, తక్షణమే అరెస్టు చేయాలన్నారు. బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని అన్నారు.

కవితపై విచారణ జరుగుతున్న క్రమంలోనే అరెస్టులపై ద్వంద అర్థాలు వచ్చే విధంగా సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు ముందస్తు ప్రణాళికలో భాగమేనని విమర్శించారు. కవితను అరెస్టు చేస్తారనే నిర్ణయానికి బీజేపీ నాయకులు ముందే వచ్చారని అన్నారు. ప్రతిపక్షాల నోర్లు నొక్కడానికి ముందస్తు ప్రణాళికతోనే అరెస్టులు చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయమని హిందూ సంస్కృతి, సాంప్రదాయం నేర్పిందా అని, రాముడు మహిళల పట్ల అత్యంత గౌరవంగా ఉండేవారని, హిందూ మతం, రాముడు పేరు చెప్పుకునే బీజేపీ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సభ్యత కాదని కూనంనేని అన్నారు. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్‌ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News