ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా.. లేక రౌడీ రాజ్యమా..? కేసీఆర్‌పై బండి ఫైర్
కమిషన్ల కోసం కేసీఆర్ కుటుంబం తెలంగాణ విద్యార్థుల జీవితాలను బలి తీసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కమిషన్ల కోసం కేసీఆర్ కుటుంబం తెలంగాణ విద్యార్థుల జీవితాలను బలి తీసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రైవేట్ వర్సిటీ హోదా రాకుండానే గురునానక్, శ్రీనిధి కాలేజీల్లో 4 వేల మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఎలా ఇస్తారని నిలదీశారు. ఈ కాలేజీల మోసాలపై పోరాటం చేస్తున్న ఏబీవీపీ నేతలను ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని మండిపడ్డారు. వేలాది మంది విద్యార్థులకు న్యాయం చేయాలని ఉన్నత విద్యా మండలికి వెళ్లిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు లాకప్‌లో ఆమెపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు.
ఇవాళ జాన్సీని పరామర్శించిన బండి సంజయ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం డబ్బులకు అమ్ముడుపోయి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. ఉన్నత విద్యా మండలి ఎదుట ధర్నా చేస్తే పోలీసులకు ఇబ్బందేటని ప్రశ్నించారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం, విద్యార్ధుల హక్కుల కోసం ఏబీవీపీ పోరాటం చేస్తోందన్నారు.
పోలీసుల తీరును తెలంగాణ బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని.. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక రౌడీ రాజ్యమా అని ప్రశ్నించారు. ఝాన్సీ అక్రమ అరెస్ట్‌కు కారకులైన ఏసీపీ శివ మారుతి, ఇతర పోలీస్ సిబ్బంది మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేట్ వర్సిటీల పేరుతో గురునానక్, శ్రీనిధి కాలేజీలు అడ్మిషన్లపై ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ జరపాలన్నారు.