అవును.. రాముడు మాకు మాత్రమే దేవుడు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
బరాబర్ ఎన్నికల్లో రాముడి పేరు చెప్పుకునే ప్రచారం చేస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: బరాబర్ ఎన్నికల్లో రాముడి పేరు చెప్పుకునే ప్రచారం చేస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎల్బీస్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈసారి కేసీఆర్ మాయ మాటలు నమ్మి మోసపోవద్దని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ‘జై శ్రీరామ్’ అన్న పేరు మనం స్మరిస్తుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు గజగజ వణుకుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలకు తప్పా ఎవరికైనా రాముడి పేరెత్తే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో మేము రాముడి పేరుతో వస్తాం.. కావాలంటే మీరు బాబర్ పేరు చెప్పి రండి అని సూచించారు.
‘రాముడు మీకు మాత్రమే దేవుడా.. అని కొందరు ప్రశ్నిస్తున్నారు.. అవును.. మాకు మాత్రమే దేవుడు.. చస్తామని తెలిసినా అయోధ్య రాముడి ఆలయం నిర్మాణం కోసం వెళ్లిన వారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ నేతలు వచ్చారా? బీఆర్ఎస్ నేతలు వచ్చారా? కమ్యూనిస్టు నాయకులు వచ్చారా? మాకు కాకుండా రాముడి పేరు చెప్పే అర్హత ఎవరికి ఉంది’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ.. మరి కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. వందరోజులు అయిపోయిందని.. ఆరు గ్యారంటీల అమలుకు ఇంకెంతకాలం పడుతుందని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఎలా ఓట్లు అడుగుతారో చూస్తామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్రంలో టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకులు జరిగితే కొట్లాడింది బీజేపీ నేతలే అని గుర్తుచేశారు. ఈ విషయంలో బీజేపీ నేతలు జైలుకు కూడా వెళ్లారని అన్నారు. మా కుంటుంబాలను పక్కన పెట్టి నిజాం, రజాకార్ల, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడామని తెలిపారు. కానీ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారు. కాంగ్రెస్ నేతలు కూడా.. బీజేపీ పోరాటం మాకు అధికారాన్ని తెచ్చి పెట్టిందని చెప్పుకుంటున్నారని అన్నారు. కానీ, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. కేసీఆర్ వల్ల సర్పంచ్‌ల బతుకు దుర్భరమైంది. ఈ తప్పు మళ్ళీ జరగొద్దు అంటే.. ఆ ఎన్నికల్లో కూడా బీజేపీ నేతలకు ఓట్లు వేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని నమ్మించడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఈసారి ఈసారి కేసీఆర్ మాయ మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు.