నీ ఉడుత ఊపులకు భయపడే ప్రస్తక్తే లేదు: KTR నోటీసులకు బండి స్ట్రాంగ్ రిప్లై

టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ హస్తం ఉందని టీ- బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Update: 2023-03-29 10:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ పరువు, ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని తనకు లీగల్ నోటీస్ జారీ చేసినట్లు వచ్చిన వార్తలను పత్రికల్లో చూశానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ పరువుకు రూ.100 కోట్లకు దావా వేస్తే.. మరీ 30 లక్షల మంది భవిష్యత్ ఏంటని, వాళ్లకు ఎంత మూల్యం చెల్లిస్తాడో చెప్పాలని బుధవారం ఒక ప్రకటనలో బండి డిమాండ్ చేశారు.

కేటీఆర్ పంపిన నోటీసులు, ఆయన ఉడుత ఊపులకు భయపడే వ్యక్తిని తాను కాదని, లీగల్ నోటీసులపై న్యాయపరంగానే పోరాడతానని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని బండి తేల్చేశారు. తెలంగాణ ఉద్యమానికి ముందు అమెరికాలో చిప్పలు కడిగే స్థాయి నుంచి నేడు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.

ఇప్పుడు పరువు నష్టం పేరుతో కూడా డబ్బులు సంపాదించాలనుకోవడం సిగ్గుచేటని విమర్శలు చేశారు. కేసీఆర్ కొడుకు ఒక స్వయం ప్రకటిత మేధావి అని ఆయన చురకలంటించారు. నాలుగు ఇంగ్లిష్ ముక్కలు మాట్లాడగానే అపరజ్ఞానిలా భావిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తే తట్టుకోలేని మూర్ఖుడని మండిపడ్డారు. పాలనలోని తప్పులను ఎత్తిచూపితే సహించలేని అజ్ఞానిగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి స్థాయిని, వయసును కూడా చూడకుండా విమర్శించడం కేసీఆర్ కొడుకు కుసంస్కారానికి నిదర్శనమని ఫైరయ్యారు.

ప్రశ్నాపత్రాలు లీకేజీ అంశాన్ని ఒక సాధారణ అంశంగా మలిచేందుకు మంత్రులంతా ప్రయత్నం చేస్తున్నారని బండి ఆరోపించారు. సిట్ విచారణ అంశాలు అసలు కేటీఆర్‌కి ఎలా లీక్ అవుతున్నాయని సంజయ్ ప్రశ్నించారు. మొదట ఇద్దరు మాత్రమే నిందితులన్న కేసీఆర్ కొడుకు పదుల సంఖ్యలో నిందితుల అరెస్టులు జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడం లేదని నిలదీశారు.

జనన, మరణ ధృవీకరణ పత్రాలు జారీ కుంభకోణం నుంచి నేటి ప్రశ్నాపత్రాల లీకేజ్ వరకు ఐటీ శాఖ మంత్రే బాధ్యత వహించాలన్నారు. నాలాలో పడి పిల్లలు చనిపోయిన దగ్గర నుంచి కుక్కల దాడిలో పసిపిల్లల చావు వరకు మున్సిపాలిటీ శాఖ మంత్రే బాధ్యత వహించి రాజీనామా చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే దాకా, నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పన పరిహారం అందించే వరకు బీజేపీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

Tags:    

Similar News