కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్..
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాకపోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ ప్రతినిధి, మేడ్చల్: భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాకపోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఈ రోజు ఎక్కడికి వెళ్లారో.. షెడ్యూల్ ను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాని సభ ముగిసిన తర్వాత సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సంజయ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రధాని మోడీ సభలో పాల్గొంటే శాలువాతో సత్కరిస్తామని ప్రకటించిన విధంగా.. తాను కేసీఆర్ కు సన్మానం చేసేందుకు శాలువా తెచ్చినట్లు చెప్పారు.
సభ ముగిసే వరకు కేసీఆర్ కోసం ఎదురు చూసినప్పటికీ ఆయన రాలేదన్నారు. దేశ ప్రధాని రాష్ట్ర అభివృద్ధి కోసం హైదరాబాద్ వచ్చి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడితే కేసీఆర్ ఎందుకు రారని ప్రశ్నించారు. కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిని కోరుకోవడంలేదని, తన కుటుంబ అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని ఆరోపించారు. కుటుంబ, నియంత పాలన అంతమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందన్నారు.