ఏడాది కాలంగా ‘బండి’ అరెస్టులు
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత నుంచి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు సరికొత్త షేప్ తీసుకున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత నుంచి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు సరికొత్త షేప్ తీసుకున్నాయి. అప్పటివరకూ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా ఉంటే, హుజూరాబాద్ రిజల్టు తర్వాత నుంచి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్‌గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317కు వ్యతిరేకంగా బండి సంజయ్ కరీంనగర్‌లోని తన ఎంపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేస్తుండగా పోలీసులు గత ఏడాది జనవరి 3న బలవంతంగా అరెస్ట్ చేశారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆయనపై కేసు నమోదు చేశారు. జ్యుడీషియల్ రిమాండులో భాగంగా కొన్ని రోజులు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఈ ఇష్యూ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ దృష్టికి వెళ్ళి పోలీసు అధికారులను ఢిల్లీలోనే విచారించి వివరణ కోరింది.
ఆ తర్వాత ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ కవిత మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలో ఆమె నివాసం ముందు జరిగిన నిరసనలో బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలో పాల్గొంటున్న బండి సంజయ్‌ను పోలీసులు గతేడాది ఆగస్టు 23న జనగాం దగ్గర అరెస్టు చేశారు.
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ప్రచార పర్వం ముగిసిపోయిన తర్వాత అక్కడ నెలకొన్న వివాదం విషయంలో అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని కలవడానికి వెళ్ళే ప్రయత్నం చేసిన సంజయ్‌ను గతేడాది నవంబరు 3న అరెస్టు చేశారు.
ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్‌కు వెళ్ళే మార్గంలో భైంసాను సందర్శించడానికి వెళ్ళాలనుకున్న సంజయ్‌ను పోలీసులు గతేడాది నవంబరు 27న అరెస్టు చేశారు. అక్కడకు వెళ్ళకముందే కరీంనగర్‌లోని తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా టెన్త్ హిందీ పరీక్ష పేపర్ లీక్ కేసులో కరీంనగర్‌లోని తన నివాసంలో అర్ధరాత్రి అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా చేర్చి హన్మకొండ కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా కరీంనగర్ జైలుకు వెళ్ళారు.
Read more: