Primark: ప్రైమార్క్ అక్రమ నిర్మాణాలపై చర్యలేవి..? పొలాలకు నీళ్లందకుండా కన్‌స్ట్రక్చన్స్!
అధికార దుర్వినియోగం, స్థానిక ప్రజాప్రతినిధులు అలసత్వం ప్రజలకు ప్రాణసంకటంగా మారింది.
దిశ, దుందిగల్ : అధికార దుర్వినియోగం, స్థానిక ప్రజాప్రతినిధులు అలసత్వం ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. ప్రైమార్క్ (Primark) నిర్మాణదారుడి కట్టుకాలువ కబ్జా పర్వంతో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలైన శ్రీ రామా అయోధ్యా విల్లాలతోపాటు సమీప ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. సర్వసాధారణంగా చెరువులు, కుంటలకు అనుసంధానం చేస్తూ నిర్మించిన కట్టుకాలువలను ఓపెన్ నాలాగా వదిలి నిర్మాణదారుడు నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. దుందిగల్ మున్సిపాలిటీ బహదూరపల్లిలో నిర్మిస్తున్న ప్రైమార్క్ నిర్మాణదారుడు బాబ్బాకాన్ చెరువుకు అనుసంధానంగా నిర్మించిన కట్టుకాలువను పూడ్చి నిర్మాణాలు చేపడుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రైమార్క్ అక్రమనిర్మాణాలతో నిర్మాణదారుడు బాబ్బాకాన్ చెరువు అలుగు ప్రవాహాన్ని సైతం అడ్డుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు నిర్మాణదారుడుకి స్థానిక 11వ వార్డు కౌన్సిలర్ భర్త సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అడ్డదారిలో నిర్మాణ అనుమతులు
కాసులకు కక్కుర్తిపడుతూ ఇరిగేషన్, హెచ్ఎండీఏ అధికారులు ప్రవర్తిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దుందిగల్ మున్సిపాలిటీ బహదూరపల్లిలోని 182, 183, 184, 186, 187, 188, 189, 191, 192, 193, 208, 210 సర్వే నంబర్లలో ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అప్లికేషన్ నంబర్ 034566/ఎంఈడి/ఆర్1/యు6/హెచ్ఎండిఏ/25022020/25-02-2020 ద్వారా అదే సంవత్సరం డిసెంబర్ 24 న నిర్మాణదారుడు బొర్రా సాంబశివరావు హెచ్ఎండీఏ అనుమతి పొందారు. అనుమతి సమయంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల ఎన్ఓసీ తప్పని సరి. ప్రైమార్క్ నిర్మాణదారుడు నిర్మిస్తున్న అపార్టుమెంట్స్‌లో ఆయా సర్వే నంబర్లలో బాబ్బాకాన్ చెరువు ద్వారా పంటపొలాలకు నిర్మించిన కట్టుకాలువ ఉంది. ప్రైమర్క్ నిర్మాణ సంస్థ కట్టుకాలువను పూడ్చి హైరైజ్ టవర్లు నిర్మించారు. అలుగు పారి ప్రమాదం సంభవించే అవకాశం ఉందని తెలిసినా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీ ఎలా ఇచ్చినట్లు, అధికారుల కళ్లుకప్పి సదరు నిర్మాణదారుడు అడ్డదారిలో అనుమతులు సంపాదించాడా...? లేక కాసులకు కక్కుర్తి పడి రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ అధికారులు నిర్మాణదారునికి పరోక్షంగా సహకరించారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
కబ్జాతో కట్టుకాలువ కనుమరుగు
బహదూరపల్లిలోని బాబ్బాకాన్ చెరువు లేక ఐడి 2858, చెరువు 39 ఎకరాలలో విస్తరించి ఉంది. నాలా ఉన్నట్టు విలేజ్ మ్యాప్ స్పష్టంగా ఉంది. 2023 సర్వేలోను తేల్చారు. సర్వే నంబర్ 188, 189, 191, 210 మీదుగా నాలా ప్రవహిస్తుంది. సుమారు 9 గుంటల నాలా విస్తీర్ణాన్ని కబ్జాచేసిన సదరు నిర్మాణ దారుడు నాలా మీద హైరైజ్ టవర్లు నిర్మించాడని సర్వేలో తేలింది. 2001 నుండి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లోని నాలా అని చూపించారు. ఇన్ని ఆధారాలు స్పష్టంగా వున్నా నిర్మాణదారునికి సహకరించే ధోరణిలో సంబంధిత అధికారులు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుంది. 2019 లో దుండిగల్ మండల సర్వేయర్ ఇచ్చిన తప్పుడు స్కెచ్ మ్యాప్ ఆధారంగానే సదరు నిర్మాణదారుడు హెచ్ఎండీఏ అనుమతులు పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆందోళనలో రైతులు..
బాబ్బాకాన్ చెరువు నుంచి ప్రవహించే కట్టుకాలువను కబ్జాచేసి ప్రైమార్క్ నిర్మాణదారుడు భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడంతో అపార్టుమెంట్స్ దిగువన ఉన్న పంటపొలాలకు నీరందే దారిలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. కట్టుకాలువ కబ్జాల నుంచి అరికట్టాలంటూ గ్రామ రైతులు అశోక్ రాజు, సత్యనారాయణ తదితరులు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా తనిఖీల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్పా కబ్జాలను అరికట్టడంలేదంటూ గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు.
సహకరిస్తున్న స్థానిక కౌన్సిలర్ భర్త
బాబ్బాకాన్ చెరువు నుండి దిగువన ఉన్న పొలాలకు పారే కట్టుకాలువను కనుమరుగు చేస్తూ ప్రైమార్క్ నిర్మాణదారుడు అక్రమ నిర్మాణాలు చేపడుతుండడంతో అడ్డుకోవాల్సిన స్థానిక 11వ వార్డు కౌన్సిలర్ భర్త సదరు నిర్మాణదారుడికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.