ఆరు గ్యారంటీలు అద్భుతం.. ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కితాబు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు అద్భుతమని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలన్నది మంచి ఆలోచన అని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కితాబునిచ్చారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు అద్భుతమని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలన్నది మంచి ఆలోచన అని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కితాబునిచ్చారు. సోమవారం హైదరాబాద్లో మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబుతో ఫిలిప్ గ్రీన్, బెంగళూరు కాన్సూలేట్ జనరల్ హిలరి మెక్ గెచ్చి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణం గురించి మంత్రి వివరించారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి ఆయా కోర్సుల్లో శిక్షణ అందించడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణకు ఆస్ట్రేలియా దేశం నుంచి పెట్టుబడులను ప్రోత్సహించడానికి చొరువ తీసుకుంటామని ఫిలిప్ గ్రీన్ స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులపై చర్చించారు. వ్యవసాయ క్లస్టర్ల గురించి మంత్రి వివరించారు. రైతులకు ప్రయోజనం కలిగే విధంగా విధానాల రూపకల్పన జరుగుతుందని, దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతులకే ప్రయోజనం కలిగేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. వ్యవసాయ రంగం, దాని ఆధారిత రంగాలను మరింత లాభసాటిగా మార్చేందుకు యూనివర్సిటీలు, నిపుణులు, పరిశోధకులు ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నారని చెప్పారు.
వీహబ్తో ఆస్ట్రేలియా ఒప్పందం
అనంతరం వీ-హబ్తో ఆస్ట్రేలియా ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళా సాధాకారత పునాదుల మీద తెలంగాణ వృద్ధి ఉంటుందని, దాన్ని తాము విశ్వసిస్తామని స్పష్టం చేశారు. అందులో భాగంగా ఉచిత బస్సు సౌకర్యం, రూ. 500 లకే ఎల్పీజీ సిలిండర్ కార్యక్రమం వంటివి చేపట్టామని వివరించారు. మహిళలకు సంబంధించి క్షత్రస్థాయి అంశాలు పరిష్కరించకపోతే వారు ప్రపంచంతో పోటీ పడడంలో అవరోధాలు ఎదురవుతాయని అభిప్రాయపడ్డారు. మహిళలకు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. వీ-హబ్తో ఆస్ట్రేలియా ప్రభుత్వం భాగస్వామ్యం పట్ల ఆనందంగా ఉందని అన్నారు. అస్ట్రేలియా ప్రభుత్వం అందించిన తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, వీ-హబ్ సీఈవో దీప్తి రావుల, తదితరులు పాల్గొన్నారు.