8 మంది అల్లుళ్ల దొంగల ముఠాకు ‘అత్త’ గ్యాంగ్ లీడర్.. చేతికి వాచ్ పెట్టుకుని మరి..

చేతి గడియారం పెట్టుకోవడంటే ఆ దోపీడీ దొంగలకు చాలా ఇష్టం.

Update: 2024-07-17 14:17 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : దొంగతనాల్లో ఈ దొంగల రూటే సపరేటు. చేతికి గడియారం పెట్టుకుని మాత్రమే వీరు దొంగతనాలకు పాల్పడతారు. అలా చేతికి వాచీ ఉంటేనే స్టేటస్‌గా భావిస్తారు. ఆ వాచీ కూడా మెటల్ బెల్ట్ మాత్రమే అయి ఉండాలి.. లెదర్ లేదా ఇతర రెగ్జిన్ బెల్టు వాచ్‌లను ఈ దొంగలు వాడరు. ఈ విధంగా ప్రత్యేక స్టైల్ ఉన్న వాచీ సంప్రదాయం కలిగిన దొంగల ముఠా ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ స్టైల్ ఉన్న దోపిడీ దొంగల ముఠా పేరే పార్ధీ గ్యాంగ్. కొద్ది రోజుల కిందట నల్లగొండ, రాచకొండ, సైబరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో భయాందోళన రేపిన పార్ధీ గ్యాంగ్‌కు ఈ తరహా స్టైల్ ఉందనే అంశం పోలీసులనే షాక్‌కు గురి చేసింది.

మహారాష్ట్రకు చెందిన ఈ పార్ధీ గ్యాంగ్ ముఠా సభ్యులకు అందరికీ తప్పనిసరిగా చేతి గడియారం ధరించడం ఓ ఫ్యాషన్. వీరు దోపీడీ దొంగతనాలు చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా చేతికి గడియారం ఉండాల్సిందే. కేవలం పడుకునే సమయంలో తప్ప మిగతా టైంలో చేతికి వాచీ ఉండాల్సిందేనని ఇటీవల విచారణలో నల్లగొండ పోలీసులకు పట్టుబడ్డ దొంగలు వెల్లడించారు. వాచ్ ఫ్యాషన్‌పై పోలీసులు ఆరా తీయగా ఈ దోపీడీ దొంగల ముఠా సభ్యులు ఫోన్‌లు అసలు వాడరని తెలిసింది. వారి సొంత గ్రామాల్లో ఉన్న ఈ ముఠా ఫోన్‌లను ఉపయోగించరని తెలిసింది.

ఈ నేపథ్యంలోనే వారు దోపీడీ దొంగతనాలకు బయలుదేరినప్పుడు ఖచ్చితంగా పది రోజులు తిరిగి ఇంటికి వెళ్లరు. ఈ పది రోజులు వారు అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జాము 4 గంటల సమయంలోనే దొంగతనాలు చేస్తారు. అది కూడా మగవాళ్లు ఒక్కరే ఉండి వెంట కుటుంబ సభ్యులు ఉన్నవారిని టార్గెట్ చేస్తారు. శివారులో నిర్మానుష్య ప్రదేశాల్లోని ఇండ్లను ఎంచుకుంటారు.

హైవే దారి పొడువున ప్రయాణిస్తారు. ఒక రోజు వీరి టార్గెట్ 5-10 దోపిడీలు చేయడం అని పోలీసుల విచారణలో తేలింది. అంతేకాకుండా వీరు మహరాష్ట్ర నుంచి బయలుదేరి వచ్చే సమయంలో టోల్ ప్లాజా వద్ద దిగుతారు. ఆ తర్వాత ఓ బైక్‌ను దొంగిలిస్తారు. దానిపై హైవే నుంచి లోపలికి దాదాపు 5 కిలో మీటర్ల వరకు అటవీ ప్రదేశాన్ని తలపించే లొకేషన్‌లు, గుట్టలు ఉన్న ప్రాంతాన్ని చూసుకుంటారు. అలా అక్కడ మకాం వేసి ఉదయం మొత్తం నిద్రపోతారు. కేవలం అర్ధరాత్రి 12 తర్వాతనే బయటికి వస్తారు. ఇలా వారికి టైం తెలియడానికి ఈ దోపీడీ దొంగలు చేతికి వాచ్‌ను ధరిస్తారని పట్టుబడ్డ పార్ధీ గ్యాంగ్ సభ్యులు అప్పా పాండురంగ, శశిపాల్ భోస్లే నల్లగొండ పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.

అలా వీరు ఈ పది రోజుల పాటు దోచుకున్న సొత్తును కొండలు, గుట్టలు, చెట్లతో ఉన్న ప్రాంతాల్లో సామాన్య మనుషులు సంచారం లేని చోట అడుగు లోతు తవ్వి అక్కడ దాచి పెడతారు. 10 రోజుల తర్వాత అన్నింటిని తీసుకుని వారి సొంత గ్రామానికి వెళ్తారని విచారణలో తేలింది. ఈ ముఠా దోపిడీ చేసే సమయంలో భయంకరంగా వ్యవహరిస్తూ భయాభ్రాంతులకు గురి చేసి దోచుకుంటారని కూడా వారు వివరించారు. వారి దోపిడీ టైమింగ్ కోసమే ఈ పార్ధీ గ్యాంగ్‌లో తరతరాలుగా చేతి గడియారాన్ని పెట్టుకోవడం ఓ స్టేటస్‌గా భావిస్తారని బయటపడింది.

కొసమెరుపు ఏంటంటే వారు ధరించే చేతి గడియారాన్ని సొంత డబ్బులతో కొంటారని చోరీ చేసిన గడియారాలను పెట్టుకోరని కూడా చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. నల్లగొండ, రాచకొండ, సైబరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో దాదాపు 32 నేరాలకు పాల్పడి జూలై 5 వ తేదీన హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట్ వద్ద పారిపోతుండగా నల్లగొండ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఇద్దరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరితో పాటు దొంగతనాలకు పాల్డడుతున్న అశోక్, అనిల్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇటీవల నల్లగొండ పోలీసులు అరెస్ట్ అయిన వారిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నప్పుడు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

8 మంది అల్లుళ్ల దోపీడీ ముఠాకు ‘అత్త’ గాడ్ ఫాదర్

మహారాష్ట్రకు చెందిన పార్ధీ గ్యాంగ్‌లోని ఓ 60 ఏండ్ల మహిళకు 8 మంది అలుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరంతా ఓ దోపీడీ ముఠాగా ఏర్పడి నేరాలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా వీరందరూ దొంగతనాలతో కాజేసిన సోత్తును మొత్తం తీసుకువెళ్లి అత్తకు ఇస్తారు. ఆమె వాటిని తమ ఇద్దరు కుమార్తెల ద్వారా వాటిని విక్రయించి వచ్చిన సొత్తును అందరూ పంచుకుంటారని విచారణలో తెలిసింది. ఈ గ్యాంగ్‌లో ఒక మహిళకు మాత్రమే ఫోన్ ఉంటుంది. ఇలా పార్ధీ ముఠాలలో ఈ అలుళ్ల దోపిడీ ముఠా ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిసింది. నల్లగొండ పోలీసులు కస్టడీలో వచ్చే సమాచారంతో మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Similar News