ఇరు పక్షాల తరఫు వాదనలు కంప్లీట్.. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు రిజర్వ్

బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న ఆ పార్టీ నేతల పిటిషన్‌పై వాదనలను ముగించిన హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.

Update: 2024-08-07 16:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న ఆ పార్టీ నేతల పిటిషన్‌పై వాదనలను ముగించిన హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. వరుసగా మూడు రోజుల పాటు ఇరు పక్షాల మధ్య వాడివేడి వాదనలు జరిగాయి. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలంటూ పిటిషనర్ల తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. స్పీకర్‌కు అలాంటి ఆదేశాలు జారీచేసే అధికారం న్యాయస్థానాలకు ఉండదని పార్టీ మారిన ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదితో పాటు ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ వాదించారు. గతంలో సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టులు వెలువరించిన తీర్పులను సైతం పిటిషనర్ల తరఫున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మూడువైపులా వాదలను విన్న జస్టిస్ విజయసేన్‌రెడ్డి తీర్పును రిజర్వులో ఉంచి విచారణను వాయిదా వేశారు.

బీఆర్ఎస్ ఇచ్చిన బీ-ఫామ్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు చర్యలకు పాల్పడి కాంగ్రెస్‌లో చేరినందున డిస్‌క్వాలిఫై చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. భద్రాచలం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును డిస్‌క్వాలిఫై చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ మరో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్లన్నింటినీ ఒకటిగా పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ విజయసేన్‌రెడ్డి సోమవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు (బుధవారంవరకు) విచారించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫిరాయించిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. గతంలో ఇదే తరహాలో మణిపూర్‌లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన ఆ రాష్ట్ర హైకోర్టు నిర్ణయాన్ని వాదనల సందర్భంగా జస్టిస్ విజయసేన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ల తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదిస్తూ, స్పీకర్‌కు ఫిర్యాదు చేయడానికి తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, హైకోర్టు ఆదేశంతో రాతపూర్వకంగా ఇవ్వాల్సి వచ్చిందన్నారు. మూడు నెలల లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని, గతంలో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారం దీర్ఘకాలం నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టడానికి వీల్లేదని హైకోర్టుకు వివరించారు. ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిఫై చేసేలా స్పీకర్‌ను అదేశించాలని, నిర్దిష్ట డెడ్‌లైన్ విధించాలని, ఆ మేరకు ఆదేశాలు జారీచేయాలని హైకోర్టును న్యాయవాది కోరారు. ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు స్పీకర్ కార్యాలయం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆ ఫిర్యాదును స్వీకరించాలంటూ అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించిందని గుర్తుచేశారు. సెక్రెటరీ కార్యాలయాన్ని ఆదేశించినప్పుడు స్పీకర్ కార్యాలయానికి కూడా అదే నిబంధన వర్తిస్తుందని వాదించారు.

దీనికి కౌంటర్‌గా ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ, సమాంతర వ్యవస్థగా ఉన్న లెజిస్లేచర్ వ్యవహారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోజాలవని, స్పీకర్‌ను ఆదేశించే అధికారం కోర్టులకు లేదని అన్నారు. నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలంటే స్పీకర్‌ను కోర్టులు ఆదేశించలేవన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించడాన్ని తప్పుపట్టారు. ముగ్గురు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ లీడర్లు ఇచ్చిన ఫిర్యాదు ఇంకా స్పీకర్ పరిశీలనలోనే ఉన్నదని, దానిపై నిర్ణయం జరగకముందే కోర్టును ఆశ్రయించారని పిటిషనర్ల తీరును తప్పుపట్టారు. స్పీకర్ కార్యాలయానికి రాజ్యాంగబద్ధమైన విధులు ఉంటాయని, వాటి విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవడం వీలుపడదని నొక్కిచెప్పారు.

ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒకరైన దానం నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదిస్తూ, గతంలో స్పీకర్‌కు ఆదేశాలను జారీ చేస్తూ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు ఆయా రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం వరకు మాత్రమే పరిమిమని, నిర్దిష్టంగా ఆ రాష్ట్రంలో ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేల కేసుతో ఇప్పుడు తెలంగాణలోని ఎమ్మెల్యేల కేసును ముడిపెట్టలేమన్నారు. పార్టీ ఎన్నికల చిహ్నాలను కేటాయించిన తర్వాత లేదా ఎమ్మెల్యేలపై నిర్దిష్టమైన ఆంక్షలు విధించిన సందర్భాన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుందని ప్రస్తావించారు. కానీ తెలంగాణలోని ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని వ్యవహారానికి ఆ రాష్ట్రాల్లోని హైకోర్టులు ఇచ్చిన తీర్పులను వర్తింపజేయలేదని, జనరల్ సూత్రీకరణగా పరిగణనలోకి తీసుకోలేమని వాదించారు.

అన్ని వైపులా వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ విజయసేన్‌రెడ్డి తీర్పును వెల్లడించకుండా రిజర్వులో ఉంచారు. ఈ ముగ్గురి అనర్హతపై పిటిషనర్లు లేవనెత్తిన వాదనలపై హైకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఉప ఎన్నికలు తప్పవంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలు చేయడంతో పాటు లీగల్ నిపుణులతో డిల్లీలో సంప్రదింపులు జరుపుతూ తదుపరి కార్యాచరణపై దృష్టిపెట్టిన సమయంలో తెలంగాణ హైకోర్టులో మూడు రోజులు వాదనలు జరిగి తీర్పు రిజర్వులో ఉంచడం గమనార్హం.

Tags:    

Similar News