యథేచ్ఛగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహణ.. ముగ్గురు యువకుల అరెస్ట్
తేలికగా డబ్బు సంపాదించే లక్ష్యంతో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్‌చేశారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: తేలికగా డబ్బు సంపాదించే లక్ష్యంతో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1.50 లక్షల నగదుతో పాటు రెండు ల్యాప్‌టాప్‌లు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్డీసీపీ రష్మీ పెరుమాల్ కథనం మేరకు.. దిల్సుఖ్నగర్ ప్రాంతానికి చెందిన ఉదయ్‌సింహా రెడ్డి, మహ్మద్ ఫహీముద్దీన్, భానుప్రసాద్ స్నేహితులు. చేస్తున్న పనుల నుంచి ఆశించిన ఆదాయం రాకపోతుండటంతో ముగ్గురు కలిసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెండు వెబ్సైట్ల నుంచి బెట్టింగ్ యాప్ ఐడీ, పాస్‌వర్డులను సేకరించారు. వీటిని ల్యాప్‌టాప్‌లో అప్లోడ్ చేసి క్రికెట్ బెట్టింగ్నిర్వహించటం మొదలు పెట్టారు.
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీలో భాగంగా న్యూయార్క్ సూపర్‌స్టార్స్, రాజస్థాన్ కింగ్స్ జట్ల మధ్య పల్లెకిలె అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి సుల్తాన్‌బజార్ స్టేషన్ పరిధిలోని స్వీకార్హోటల్ వద్ద ముగ్గురు కలిసి బెట్టింగులు స్వీకరిస్తుండగా సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్సీఐ ఎన్.రామకృష్ణ ఎస్సై నవీన్‌కుమార్‌తో పాటు సిబ్బందితో కలిసి దాడి చేసి అరెస్ట్చే శారు. విచారణలో నిందితులు గూగుల్‌పే, ఫోన్‌పే యాప్‌ల ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్లుగా వెల్లడైంది. కొన్నిసార్లు భానుప్రసాద్ నేరుగా బెట్టింగులు కట్టిన వారి వద్దకు వెళ్లి నగదును తీసుకు వచ్చేవాడని తేలింది. ముగ్గురు నిందితులపై కేసులు నమోదు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం వారిని సుల్తాన్ బజార్ పోలీసులకు అప్పగించారు.