హైదరాబాద్‌లో తనిఖీ పేరిట దోపిడీ.. ఏఆర్​ కానిస్టేబుల్​ అరెస్ట్

తనిఖీల పేరుతో వ్యాపారి నుంచి రూ.18.50 లక్షలు దోచుకుని ఉడాయించిన

Update: 2023-10-28 15:24 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: తనిఖీల పేరుతో వ్యాపారి నుంచి రూ.18.50 లక్షలు దోచుకుని ఉడాయించిన ఉదంతంలో ఆర్మ్ డ్ రిజర్వ్​డ్​ కానిస్టేబుల్​ను ఉద్యోగం నుంచి డిస్మిస్​ చేస్తూ రాచకొండ కమిషనర్ ​డీ.ఎస్.చౌహాన్​ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బేగంబజార్ ​ప్రాంత నివాసి, ప్రైవేట్ ​ఉద్యోగి అయిన ప్రదీప్​శర్మకు 20లక్షల రూపాయలు ఇచ్చిన మెహదీపట్నంలోని చిమన్​లాల్ ​సురేష్​కుమార్​ టెక్స్​టైల్స్ ​ఉద్యోగి అక్షయ్.. ఆ మొత్తాన్ని పంజగుట్టలోని బ్యాంక్​ ఆఫ్​ బరోడాలో జమ చేయాలని చెప్పాడు. ఈ క్రమంలో శుక్రవారం ప్రదీప్​శర్మ డ్రైవర్​ శంకర్​తో కలిసి కారులో బ్యాంకుకు వెళుతుండగా.. పోలీస్​ యూనిఫాంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు బైక్​పై వచ్చి బంజారాహిల్స్ ​తాజ్​మహల్ ​హోటల్ ​సమీపంలో కారును అడ్డగించారు. అనంతరం తనిఖీల పేరుతో ఇరవై లక్షల రూపాయల నగదుతో ఉన్న బ్యాగును తీసుకున్నారు. ఆ తరువాత ప్రదీప్ శర్మ వచ్చిన కారులోనే ఖైరతాబాద్ ​మెట్రోస్టేషన్​కు వచ్చి నగదుతో ఉన్న బ్యాగును తిరిగిచ్చేసి అక్కడి నుంచి ఉడాయించారు.

ఆ తరువాత చూసుకోగా బ్యాగులో కేవలం లక్షా యాభై వేల రూపాయల నగదు మాత్రమే కనిపించింది. ఈ మేరకు ప్రదీప్​శర్మ ఫిర్యాదు చేయగా.. పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో 2018వ సంవత్సరం బ్యాచ్​కు చెందిన ఏఆర్​కానిస్టేబుల్​ బళ్లారి శ్రీకాంత్​ ఈ నేరానికి పాల్పడినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో శ్రీకాంత్​ను ఉద్యోగం నుంచి డిస్మిస్​ చేస్తూ శనివారం రాచకొండ కమిషనర్​డీ.ఎస్.చౌహాన్​ ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డటంతో పాటు అలసత్వాన్ని ప్రదర్శించినా ఉపేక్షించేది లేదని కమిషనర్ ​సిబ్బందిని హెచ్చరించారు.


Similar News