G. Kishan Reddy : పార్టీ స్టేట్ చీఫ్ నియామకం.. కిషన్‌రెడ్డి అలిగారా?
పార్టీ స్టేట్ చీఫ్ బాధ్యతలు ఇచ్చాక కిషన్ రెడ్డి తీరు పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : పార్టీ స్టేట్ చీఫ్ బాధ్యతలు ఇచ్చాక కిషన్ రెడ్డి తీరు పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతున్నది. ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు. మీడియాతోనూ మాట్లాడలేదు. కేంద్ర కేబినెట్‌కు సైతం కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. ఢిల్లీలోనే ఉన్నప్పటికీ కేంద్ర మంత్రి హోదాలో ఆయన కేబినెట్ మీటింగ్‌కు గైర్హాజరు కావడం హాట్ టాపిక్ అయింది. రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో కిషన్ రెడ్డి అలిగారా? కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఇన్నాళ్లు ఆయన చూసిన మంత్రిత్వ శాఖ అధికారులు ఇవాళ కిషన్ రెడ్డి నివాసానికి రాకపోవడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారనే ప్రచారం జోరుగా వినిపిస్తున్నది. మరోవైపు ఈనెల 13,14 తేదీల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి హోదాలో ఆయన అమెరికా వెళ్లాల్సి ఉన్నది. న్యూయార్క్‌లో ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సులో కిషన్ రెడ్డి ప్రసంగించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయన సైలెంట్‌గా ఉండడం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారి తీసింది.
ఈ రిస్క్ నాకొద్దు!
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర అధ్యక్షుడిగా తనను నియమించడం పట్ల కిషన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. పార్టీ బాధ్యతల కన్నా కేంద్ర మంత్రిగా కొనసాగడమే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. అందువల్లే కిషన్ రెడ్డి పార్టీ పగ్గాలు స్వీకరించేందుకు విముఖత చూపుతున్నట్లు ఢిల్లీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తున్నది. ఈ కారణం వల్లే అధిష్టానం నిర్ణయం తీసుకున్నా కిషన్ రెడ్డి మాత్రం మౌనం వహిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే కాలి నొప్పి కారణంగానే ఇవాళ్టి కేబినెట్ మీటింగ్‌కు హాజరుకాలేకపోయానని కేంద్రానికి సమాచారమిచ్చినట్లు తెలిసింది.