ఆ జడ్జికే ఛాన్స్ అంటూ ఊహాగానాలు.. విద్యుత్ కమిషన్‌కు కొత్త జడ్జి ఎవరు?

చత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ళతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలోని అవకతవకలపై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎంక్వయినీ కమిషన్ హెడ్‌గా జస్టిస్ నర్సింహారెడ్డిని తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఆయన స్థానంలో వచ్చే కొత్త రిటైర్డ్ జడ్జి ఎవరనే చర్చలు మొదలయ్యాయి.

Update: 2024-07-17 23:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : చత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ళతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలోని అవకతవకలపై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎంక్వయిరీ కమిషన్ హెడ్‌గా జస్టిస్ నర్సింహారెడ్డిని తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఆయన స్థానంలో వచ్చే కొత్త రిటైర్డ్ జడ్జి ఎవరనే చర్చలు మొదలయ్యాయి. కమిషన్ హెడ్‌గా జస్టిస్ నర్సింహారెడ్డి తప్పుకుంటూ సుప్రీంకోర్టుకే నోట్‌ పంపారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించనున్నదీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సోమవారం (జూలై 22న) సుప్రీంకోర్టుకు తెలియజేయనున్నారు. నాలుగు రోజుల్లో కొత్త హెడ్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని ఖరారు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా తప్పుకున్న జస్టిస్ నర్సింహారెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కావడంతో కొత్తగా వచ్చే రిటైర్డ్ జడ్జి నాన్-తెలుగు వ్యక్తి అవుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

జస్టిస్ నర్సింహారెడ్డిని తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం అనంతరం ఏఐసీసీ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్‌తో మాట్లాడినట్లు తెలిసింది. కమిషన్ గతంలో కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసు, దానిపై హైకోర్టులో దాఖలైన పిటిషన్, వెలువడిన తీర్పు, దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ, చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఉత్తర్వులు... వీటన్నింటిపై సీఎంతో ఏఐసీసీ పెద్దలు మంగళవారమే చర్చించారని సీఎంఓ వర్గాల సమాచారం. ఏ పరిస్థితుల్లో ఈ వ్యవహారమంతా చోటుచేసుకున్నదో సీఎం నుంచి ఆరా తీసినట్లు తెలిసింది. జస్టిస్ నర్సింహారెడ్డిని మార్చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో పొరపాటు ఎక్కడ జరిగిందో, దానికి దారితీసిన పరిస్థితులేంటో ఏఐసీసీ పెద్దలు తెలుసుకున్నారు. తదుపరి కమిషన్ ఎంక్వయిరీ ప్రక్రియపై వీరి మధ్య చర్చలు జరిగాయి.

జస్టిస్ నర్సింహారెడ్డి స్థానంలో ఎవరిని నియమించాలనే విషయంలో సీఎం, ఏఐసీసీ నేతల మధ్య చర్చలు జరిగిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల స్థానికత లేని రిటైర్డ్ జడ్జి వచ్చే అవకాశాలున్నట్లు ఊహగానాలు వెలువడుతున్నాయి. ప్రజా ధనం వృథా అయిందనే అభిప్రాయంతో కమిషన్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జస్టిస్ నర్సింహారెడ్డి ఆ బాధ్యతల నుంచి తొలగిపోయినా మరో రిటైర్డ్ జడ్జి వచ్చినా ఎంక్వయిరీ ప్రాసెస్ యధావిధంగా కొనసాగనున్నది. జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ తన పిటిషన్‌లో కోరినా దానికి బదులుగా ఎంక్వయిరీ కంప్లీట్ కాకుండానే ప్రెస్ మీట్ పెట్టారనే కారణంతో తొలగించాలని సుప్రీంకోర్టు కోరడం గమనార్హం.

కమిషన్‌ను రద్దు చేయడానికి సప్రీఐంకోర్టు నిరాకరించింది. కమిషన్‌ను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సైతం తప్పుపట్టలేదు. కమిషన్‌ ఏర్పాటుపై మరో జీవో ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ నర్సింహారెడ్డి స్థానంలో కొత్తగా వచ్చే రిటైర్డ్ జడ్జి ఎవరనేది రాష్ట్ర ప్రభుత్వం, ఏఐసీసీ ఖరారు చేయనున్నాయి. ఆ రిటైర్డ్ జడ్జి ఎవరినేది ఆసక్తికరంగా మారింది. సమర్ధులైనవారినే నియమించి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో కమిషన్‌ను నియమించిందో ఆ లక్ష్యం నెరవేరేలా తదుపరి ఆలోచనలు ఉంటాయన్నది కాంగ్రెస్ వర్గాల సమాచారం.


Similar News