ఈ నెల 15 నుంచి ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు షురూ
ఈ నెల 15 నుంచి తెలంగాణలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చే అకడమిక్ ఇయర్ లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, కో ఆపరేటివ్, తెలంగాణ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ, కేజీబీవీ, మోడల్ జూనియర్ కాలేజీలు, టీఎంఆర్జేసీ, కాంపోజిట్ డిగ్రీ కాలేజీల్లో ఇంటర్ ప్రవేశాలకు అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈనెల 15వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. అడ్మిషన్ల ప్రక్రియ జూన్ 30వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. కాగా వచ్చే నెల 1వ తేదీ నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభంకానున్నాయని వెల్లడించారు.
ఆయా కేటగిరీల వారీగా విద్యార్థులకు సీట్ అలాట్ మెంట్ చేపట్టాలని ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఆదేశించారు. అనుమతి పొందిన కాలేజీల్లో మాత్రమే అడ్మిషన్లు తీసుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు పేరెంట్స్, స్టూడెంట్స్ కు సూచించారు. జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అనుమతి పొందిన కాలేజీల వివరాలు బోర్డు అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు acadtsbie.cgg.gov.in లేదా tsbie.cgg.gov.in వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు.