SC Classification : ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ కీలక వినతి
ప్రభుత్వం ఎస్సీ ఏబీసీబీ వర్గీకరణ చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ మాదిగ కోరారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం ఎస్సీ ఏబీసీబీ వర్గీకరణ చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ మాదిగ కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణ రావు భవన్‌లో మాజీ న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమీషన్ శమీమ్ అక్తర్ కార్యాలయంలో జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర కమిటీ తరుఫున వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు వర్గీకరణ చేసి ఎస్సీ జాబితాలో ఉన్న59 కులాలతో పాటు వారికి జనాభా దామాషా ప్రకారం ఎవరికెంతో వారికి అంత వాటా ఇచ్చి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ డిమాండ్ గత 30 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నదన్నారు . ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన పేద కులాల ప్రజల స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగం ద్వారా అందాల్సిన ఫలాలు 59 కులాలకు సక్రమంగా అందడం లేదని 30 ఏళ్లుగా పోరాటం జరుగుతుందన్నారు. షెడ్యూల్ కులాల ప్రజలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. స్వాతంత్రం కన్నా ముందే నిజాం కాలంలో భాగ్యరెడ్డి వర్మ నాయకత్వంలో దళితుల అభ్యున్నతి కోసం జరిగిన కృషిలో కూడా ఎస్సీ జాబితాలో ఉన్న మాదిగ, ఉపకులాల ప్రజలకు అన్యాయమే జరిగిందని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఆధారంగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విచక్షణాధికారంతో 2011 జనాభా లెక్కల ఆధారంగానే కాకుండా2014, 2024 లో తీసిన జనాభా లెక్కల ఆధారంగా కోటాను పెంచి జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణక చేసి న్యాయం చేయాలన్నారు. బూర్గుల నాగేందర్ మాదిగ వెంట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్, రాష్ట్ర కార్యదర్శి సుక్క అశోక్ మాదిగ, బాలకృష్ణ తదితరులు ఉన్నారు.
కుల నిర్మూలన వేదిక (కేఎన్వీ) ఆధ్వర్యంలో ప్రత్యేక అభ్యర్థన
ఎస్సీల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలతో పాటు 59 కులాలకు విద్య, ఉద్యోగ రంగంలో సక్రమంగా రిజర్వేషన్లు అందడం లేదని మాదిగ, మాలతో అత్యంత వెనుకబడిన పేద కులాల ప్రజలు ఏబిసిడి వర్గీకరణ డిమాండ్ చేస్తూ గత 30 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో పోరాడుతున్నదని కుల నిర్మూలన వేదిక (కేఎన్వీ) అధ్యక్షుడు పాపని నాగరాజు అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమీషన్ వినతి పత్రం అందజేసిన ఆయన.. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విచక్షణాధికారంతో జనాభా లెక్కల ఆధారంగా, కోటాను పెంచి, జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణక చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.