శివ బాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్..బినామీలకు ఏసీబీ నోటీసులు
రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో:రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా శివ బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. శివ బాలకృష్ణకు బినామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణికి నోటీసులు అందాయి. ఇవాళ ఈ ముగ్గురిని ఏసీబీ విచారించబోతున్నది. శివ బాలకృష్ణను విచారించిన సందర్భంగా కీలక వివరాలు సేకరించిన దర్యాప్తు అధికారులు ఆయన బినామీల పేర్లపై ఉన్న డాక్యుమెంట్లను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఇక యాదాద్రి జిల్లాలో 57 ఎకరాల భూమిని శివ బాలకృష్ణ తన బినామీల పేరుతో కొనుగోలు చేసినట్లు గుర్తించిన అధికారులు.. వాటిపై దృష్టి సారించారు. యాదాద్రి జిల్లా వలిగొండ, బీబీనగర్, మోత్కూర్ మండలాల్లో శివబాలకృష్ణ కుటుంబీకుల పేరు మీద భారీగా భూములు కొనుగోలు చేశారని, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఏసీబీ యాదాద్రి కలెక్టర్ ఇప్పటికే లేఖ రాసింది. ఈ నేపథ్యంలో తాజాగా బినామీలకు నోటీసులు అందడం వారిని విచారణ చేయనుండటం ఆసక్తిగా మారింది.
పెద్ద వ్యక్తుల పాత్రపై:
శివ బాలకృష్ణ కేసులో తవ్వినకొద్ది కొత్త కోణాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై ఆరోపణలు రాగా తాజాగా బినామీలను విచారణకు పిలవడం ఆసక్తిగా మారింది. తాజాగా శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఆ సందర్భంలో జరిగిన వాదనలో ఏసీబీ కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడి వద్ద రూ. 250 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించామని దీని వెనుక పెద్ద వ్యక్తుల హస్తం ఉందని కోర్టుకు ఏసీబీ తెలిపింది. బెయిల్ ఇవ్వొద్దని వాదించింది. దీంతో అతడికి కోర్టు బెయిల్ నిరాకరిచిన సంగతి తెలిసిందే. అయితే శివబాలకృష్ణ కేసులో ముడిపడిన పెద్దలు ఎవరు? ఏసీబీ తన విచారణలో ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది. శివబాలకృష్ణ అతడి సోదరుడిని విచారించిన అధికారులు విస్తుపోయే అంశాలను కనుగొనగా ఇక బినామీలను విచారిస్తే ఎలాంటి అంశాలు బయటకు వస్తాయో అనేది సస్పెన్స్ గా మారింది.