కేటీఆర్ ఖాతాలో మరో మిస్ ఫైర్.. BRS శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి!
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు దీరి నెల రోజులు కాకముందే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పాలిటిక్స్ ముదురుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు దీరి నెల రోజులు కాకముందే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పాలిటిక్స్ ముదురుతున్నాయి. అధికార విపక్ష నేతల మధ్య తగ్గేదే లే అన్నట్లుగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నంలో ప్రగతి నివేదిక, స్వేద పత్రం విడుదల చేసి విమర్శల పాలైన బీఆర్ఎస్ పార్టీ తాజాగా 420 పేరుతో బుక్ లెట్ రిలీజ్ చేసి మరోసారి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటోంది. కొత్త ప్రభుత్వంపై కౌంటర్ల కోసం కేటీఆర్ చేస్తున్న వరుస ప్రయత్నాలు ఆ పార్టీకి మిస్ ఫైర్ అవుతున్నాయనే టాక్ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతున్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా కాంగ్రెస్ పార్టీ 420 వ్యాఖ్యలపై లీగల్ యాక్షన్‌కు సిద్ధమైంది. దీంతో ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నంలో కేటీఆర్ ప్రతిసారి విఫలం అవుతూ అధికార పక్షానికి ఆయుధాలు అందిస్తున్నారని టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
కేసీఆరే నెంబర్ వన్ 420: కాంగ్రెస్
కొత్త ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలకు కాలు దువ్వడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం నిలదొక్కుకునే టైమ్ కూడా ఇవ్వకుండా మొదటి నుంచి రేవంత్ రెడ్డి సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకే బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో అధికార పక్షంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై నెటిజన్లు తిరిగి గులాబీ నేతలకే ప్రశ్నలు సంధిస్తున్నారు. రెండు దఫాలుగా అధికారంలో ఉన్నప్పుడు మౌనం పట్టించుకోని గులాబీ నేతలు ప్రభుత్వ నిర్ణయాలపై ఆత్రం పనికిరాదంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ హామీలపై 420 పేరుతో కేటీఆర్ బుక్ లెట్ విడుదల చేయడంపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. తెలంగాణలో కేసీఆరే నెంబర్ వన్ 420 అని రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. ఇక తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారంటూ కేటీఆర్ పై చార్మినార్ కామాటిపురా పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు.
ఇలాగైతే పార్టీ నిలబడేనా?:
రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. తెలంగాణలో ఇక తమకు తిరుగులేదనే ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోయి ఘోరంగా దెబ్బయిపోయిందనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలే పార్టీ ఓటమికి స్వయంకృతాపరాధంగా మారిందనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ కు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే రేస్ జరుగబోతుందని ఈ రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ కు కష్టాలు తప్పవనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కొత్త ప్రభుత్వంపై విమర్శించేందుకు కేటీఆర్ అత్యాత్సాహం చూపడం వల్ల అది బీఆర్ఎస్ కే మైనస్ అవుతుననే చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష హోదాలో ప్రజాసమస్యలపై నిర్మాణత్మక ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సిన కేటీఆర్ ఉత్సాహంనికి పోయి గత ప్రభుత్వ వైఫల్యాలను తెరమీదకు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే పార్టీ మనుగడ సాగేనా అని గులాబీ పార్టీ నేతలే తమ సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.