KCR family నుంచి పాలిటిక్స్‌లోకి మరొకరు!
సీఎం కేసీఆర్ ఫ్యామిలీ నుంచి మరొకరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.
సీఎం కేసీఆర్ ఫ్యామిలీ నుంచి మరొకరు పాలిటిక్స్‌లోకి రానున్నారా? వస్తే వారిని కేసీఆర్.. ఎక్కడి నుంచి బరిలోకి దించబోతున్నారు? సదరు వ్యక్తికి ఎంపీ టికెట్ ఇస్తారా? లేక ఎమ్మెల్యే టికెటా? ఇంతకూ ఆ వ్యక్తి ఎప్పుడు ఎంట్రీ ఇవ్వనున్నారు? వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే ఆ స్థానంలో ప్రస్తుతం ఉన్న వారి పరిస్థితి ఏంటి? అసలు ఫాంహౌస్ లో విందులు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు?
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ ఫ్యామిలీ నుంచి మరొకరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. అందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని టాక్. వచ్చే ఎన్నికల్లో ఎలాగైన పోటీ చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. ఇందుకోసం ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన గులాబీ పార్టీలోని ముఖ్య నేతలకు తరుచుగా ఆయన తన ఫాంహౌజ్ విందులు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటానని, తనకు తప్పకుండా సహకరించాలని ఆయన నేతలను కోరుతున్నట్టు తెలిసింది.
సీఎం సోదరుడి కొడుకు?
రాజకీయాల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే నలుగురు కీలక పదవుల్లో ఉన్నారు. మేనల్లుడు హరీశ్, కొడుకు కేటీఆర్ మంత్రులుగా కొనసాగుతున్నారు. కూతురు కవిత ఎమ్మెల్సీగా, కేసీఆర్ భార్య శోభ చెల్లెలి కొడుకు సంతోష్ రాజ్యసభ మెంబర్‌గా ఉన్నారు. కేసీఆర్ అన్న రంగారావుకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె రమ్యారావు మొదట్లో కేసీఆర్ వెంటా నడిచారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. 2012లో కేసీఆర్‌తో విభేదాలు రావడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి టికెట్ కోసం ప్రయత్నించారు. ఇక రంగారావు ఇద్దరు కొడుకుల్లో ఒకరు చాలా కాలంగా రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సారి వారిలో ఒకరిని ఎలాగైనా ఎంపీ లేదా ఎమ్మెల్యేగా గెలిపించుకుని చట్టసభల్లోకి పంపేందుకు సీఎం ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. చట్టసభల్లోకి వెళ్లాలని రంగారావు కొడుకుల్లో ఒకరు ఆశ పడుతున్నారని చింతమడక వాసులు చెబుతున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. సిద్దిపేట అసెంబ్లీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కాని అది మరొకరికి దక్కడంతో నిరాశ చెందారు.
ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి?
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే లేదా ఎంపీ స్థానానికి పోటీ చేయాలని రంగారావు కుమారుడు భావిస్తున్నారు. మెదక్ ఎంపీగా కొనసాగుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆశ పడుతున్నారు. ఒక వేళ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రంగారావు కుమారుడికి మెదక్ ఎంపీ టికెట్‌ను ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు టాక్. ఒకవేళ అది కుదరకపోతే సిద్దిపేట అసెంబ్లీ టికెట్ ఇచ్చే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్ రావును సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించి, ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో మెదక్ నుంచి బరిలోకి దించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. హరీశ్ ఎంపీగా ఎన్నికైన తర్వాత సిద్దిపేట అసెంబ్లీకి ఉప ఎన్నిక రావడం అనివార్యం. ఈ స్థానానికి రంగారావు కుమారుడి బరిలోకి దించే చాన్స్ ఉంది.
కేసీఆర్ వెంటే..
ఎలాగైనా పాలిటిక్స్‌లోకి రావాలని భావిస్తున్న కేసీఆర్ అన్న కుమారుడు.. ఈ మధ్య ఎక్కువగా సీఎం వెంట కనిపిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నా, ఫాంహౌజ్‌కు వెళ్లినా కొందరు లీడర్లను వెంట తీసుకెళ్తున్నారు. అందులో రంగారావు కుమారుడు సైతం దర్శనమిస్తున్నట్టు టాక్. అప్పట్లో సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు కూడా అతన్ని హెలికాప్టర్‌లో తీసుకెళ్లారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సమయం ఉన్నప్పుడల్లా కేసీఆర్.. అతన్ని పిలుచుకుని రాజకీయ పాఠాలు నేర్పుతున్నట్టు టాక్. వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీగా ఉండాలని అతనికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకే అతడు ఈ మధ్య తరుచుగా సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో విందులు ఇస్తున్నట్టు టాక్. ఈ విందులకు కేవలం సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతానికి చెందిన లీడర్లే కాకుండా, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన సీనియర్ లీడర్లను కూడా పిలుస్తున్నట్టు తెలిసింది. సీఎం అనుమతి లేనిదే అతడు ఇలా లీడర్లకు విందు ఇచ్చే చాన్స్ లేదని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ లీడర్ అభిప్రాయపడ్డారు.
Also Read....