Congress : మళ్ళీ తెలంగాణ, ఏపీ పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం! టీ కాంగ్రెస్ హెచ్చరిక
తెలంగాణ సచివాలయం ముందు ప్రతిష్టించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగించి గాంధీ భవన్‌కు పంపుతామని తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సచివాలయం ముందు ప్రతిష్టించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగించి గాంధీ భవన్‌కు పంపుతామని తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. దీనిపై మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించింది. మిస్టర్ మాజీ మినిస్టర్ కేటీఆర్.. ఇంకెన్ని రోజులు ఈ డ్రామాలు అంటూ కాంగ్రెస్ పోస్ట్ చేసింది. ‘ప్రజలకు పాలన అందించే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు? సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండకూడదని మీరు భావిస్తున్నారా? తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిపాలనా కార్యాలయం లోపల ప్రతిష్టిస్తే మీ దొరలకు చూడటం ఇష్టం లేదా?’ అని ప్రశ్నించింది. విద్వేషాలను రెచ్చగొట్టే చిల్లర రాజకీయాలు మానుకో కేటీఆర్ అంటూ ఫైర్ అయింది.
అప్పుడు తెలంగాణ తల్లి ఎందుకు గుర్తుకు రాలేదు?
‘తెలంగాణ తల్లిపై నీకు కొంచెం కూడా గౌరవం లేదు. నీ అక్కసు అంతా కాంగ్రెస్‌పై బురద జల్లడం కోసమే. అధికారం పోయిన తర్వాత మీకు తెలంగాణ తల్లి గుర్తుకు వస్తుందా? 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు మీరే కదా అధికారంలో ఉంది. అప్పుడు తెలంగాణ తల్లి మీకెందుకు గుర్తుకు రాలేదు? అధికార అహంకారం ఆవహించి, రాచరిక పోకడలతో, తెలంగాణ రాష్ట్రం మీ తాతల ఆస్తులు అన్నట్టు అనుభవించారు. తెలంగాణ ప్రజలు మీ చెవులు పట్టుకుని గుంజీలు తీపించి ఓడిస్తే కూడా మీలో మార్పు రాలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో గోడ కుర్చీ వేయించారు. ఇంకా ఇలానే కొనసాగిస్తే తలకిందులుగా వేలాడదీసి కోదండం వేస్తారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని హుందాగా వ్యవహరించు కేటీఆర్. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పడం వెనుక మీ కుటిల పన్నాగాలు అర్థం అవుతున్నాయి’ అని విమర్శించింది.
మీ రాజకీయ ఉనికి కోసం..
మీ రాజకీయ ఉనికి కోసం మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర పేరుతో ప్రజలను, యువతను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. యువతను రెచ్చగొట్టి మీ ఫామ్‌హౌస్‌లో తయారు చేసిన విషపు చుక్కలను వారి మెదళ్లలో ఎక్కించడానికి జరిగే ఈ కుట్రలను అడ్డుకుంటామన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని చూస్తున్న బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలను నిలువరిస్తామన్నారు. దొరల ఎత్తులను చిత్తు చేసి, తెలంగాణ అభివృద్ధి నిరోధకులపై ఉక్కుపాదం మోపుతం ఖబడ్దార్.. అంటూ తెలంగాణ కాంగ్రెస్ హెచ్చరించింది.