‘సమ్మెల’ కాలం.. ఎలక్షన్ టైమ్‌లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహం
సమస్యల పరిష్కారానికి వివిధ శాఖల్లో పని చేసే కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు. ఇప్పటికే అంగన్ వాడీలు కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: సమస్యల పరిష్కారానికి వివిధ శాఖల్లో పని చేసే కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు. ఇప్పటికే అంగన్ వాడీలు కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఇప్పుడు అదే బాట పట్టారు. ఎలక్షన్ టైమ్ లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచితే తమ సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారు. ఎన్నికలపై ప్రభావం పడకూడదని ఇప్పటికే ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులతోపాటు వీఆర్ఏలు, పలువురు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసింది. ఆర్టీసీని సైతం ప్రభుత్వంలో విలీనం చేసింది. అయితే తమ సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకొని పరిష్కరించాలని అంగన్ వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులు కోరుతున్నారు.
హామీలు ఇచ్చినా..
తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర పాలకులు చెబుతున్నా.. తమ సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని అంగన్ వాడీలు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు, పాడిచ్చేరిలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాయని చెబుతున్నారు. కర్ణాటకలో హెల్త్ కార్డులు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పండగ బోనస్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారని పేర్కొంటున్నారు. తెలంగాణలో మాత్రం ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని వాపోతున్నారు. కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ అంగన్ వాడీలు గతంలోనూ సమ్మె చేశారు. అప్పుడు మంత్రి సత్యవతి రాథోడ్ సంఘ నాయకులతో చర్చలు జరిపారు. రిటైర్మెంట్ జెనిఫిట్స్, ప్రమాద బీమా సౌకర్యం, ఉద్యోగి చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, సంక్షేమ పథకాలు వర్తించేలా విధంగా సర్క్యులర్ జారీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటి వరకు హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చకపోవడంతో అంగన్ వాడీలు మళ్లీ సమ్మె బాట పట్టారు.
పెండింగ్ బకాయిల కోసం..
పెండింగ్ బకాయిల కోసం మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె బాట పట్టారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి మధ్యాహ్న భోజనం అందిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇప్పుడు అల్పాహారం పేరిట అదనపు భారం వేసేందుకు ప్రయత్నిస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దసరా నుంచి ప్రారంభించాలనుకుంటున్న అల్పాహారానికి అదనంగా చెల్లించాలని కోరుతున్నారు.
ఇబ్బందులు పడుతున్నా..
అంగన్ వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మెతో విద్యార్థులు, చిన్నారులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంగన్ వాడీల్లో వీఏఓల సహాయంతో సరుకుల పంపిణీకి ప్రయత్నిస్తున్నది. అయినా పూర్తిస్థాయిలో సరుకులు వారికి అందడం లేదు. మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె చేస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందేలా లేదు. విద్యార్థులు, చిన్నారులు, బాలింతలు ఇలా ఎందరో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మాత్రం సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదని అంగన్ వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులు చెబుతున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదు. అంగన్ వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.