దిశ, చార్మినార్: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న హైదరాబాద్ విద్యార్థి రాహుల్ గుప్త శుక్రవారం ఉదయం పాతబస్తీ లాల్ దర్వాజాకు సురక్షితంగా చేరుకున్నాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో తన కొడుకు రాహుల్‌ని చూసిన తల్లిదండ్రులు జ్యోతిక, వేణుగోపాల్ గుప్తలు సంతోషం వ్యక్తంచేశారు. భారత ప్రభుత్వం సహకారంతోనే తన కుమారుడు క్షేమంగా చేరాడని హర్షించారు. కానీ, కుమారుడిపై భవిష్యత్తుపై ఇప్పుడు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాహుల్ ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. జూన్‌లో జరుగనున్న పరీక్షతో థర్డ్ ఇయర్ పూర్తి అవుతుందని అన్నారు. మరో మూడేండ్లలో ఎంబీబీఎస్ పూర్తయిపోతది అనుకుంటున్న తరుణంలో ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం ప్రారంభించడతో చదువు మధ్యలో ఆపేసి వెనుదిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది.
అంతేగాక, తన ఒరిజినల్ సర్టిఫికేట్‌లు యూనివర్శిటీలో ఉన్నాయని, విలువైన లగేజ్ అంతా అక్కడే ఉందని, రాహుల్ ఒక్కడే ఇక్కడికి చేరుకోగలిగాడన్నారు. ఇంటర్ ఫలితాల్లో 93 శాతం వచ్చినా, మన దేశంలో మెడిసిన్ లాంటి ఉన్నత విద్య చదవడం చాలా ఖర్చుతో కూడుకున్నదని, తాను ఇంకా ఓసీ కావడంతో తప్పని పరిస్థితుల్లో ఉక్రెయిన్‌కు వెళ్ళాళ్సి వచ్చిందన్నారు. కేవలం ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ను 30 నుంచి 40 లక్షల లోపు పూర్తి చేసుకునే అవకాశం ఉండడంతోనే మెడిసిన్ చదవడానికి ఉక్రెయిన్ వెళ్ళాల్సి వచ్చిందన్నారు. కరోనా సమయంలో ఇండియాకు చేరుకుని ఏడాది పాటు ఆన్‌లైన్ క్లాసులు విన్నామని తెలిపారు. మార్చి 13 తర్వాత కూడా ఆన్‌లైన్ క్లాసులు ఉంటాయని యూనివర్శిటీ తెలిపిందని, ప్రాక్టికల్‌లో మాత్రం పట్టు సాధించలేమంటున్నాడు. దీంతో తన మూడేళ్ల చదువు వృథా కానుందని విద్యార్థితోపాటు తల్లిదండ్రులు కలత చెందుతున్నారు. భారత ప్రభుత్వం ఎలాగైనా తమ భవిష్యత్తుకు బాసటగా నిలవాలని రాహుల్ కోరుతున్నాడు.