నగరంలో అంతర్జాతీయ మొబైల్ స్నాచింగ్ ముఠా! నడుచుకుంటూ వెళ్లే వారే టార్గెట్..
నగరంలో అంతర్జాతీయ మొబైల్ స్నాచింగ్ ముఠాకు చెందని వారిని సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో అంతర్జాతీయ మొబైల్ స్నాచింగ్ ముఠాకు చెందని వారిని సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాకు చెందిన ఐదుగురు సూడాన్ దేశస్థులతో సహా 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.75 కోట్ల విలువైన 7.03 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను హైదరబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నిందితుల్లో 12 మంది హైదరాబాద్‌కు చెందినవారని, ఐదుగురు సూడాన్ వాసులు ఉన్నారని వెల్లడించారు. రాత్రి సమయంలో నడుచుకుంటూ వెళుతున్న వారిని మొబైల్ స్నాచింగ్ ముఠా టార్గెట్ చేసుకుంటున్నారని తెలిపారు. కొన్ని సందర్భాల్లో వారిని మాటల్లో పెట్టి మొబైల్ స్నాచింగ్, నగదు చోరీ చేస్తున్నారని చెప్పారు. రాత్రి 10 గంటలు తర్వాత స్నాచింగ్స్ ఎక్కువగా జరుగుతున్నట్టు గుర్తించామన్నారు.
మూడు కమిషనరేట్ల పరిదిలో ఈ స్నాచింగ్ జరుగుతున్నదని, చోరీకి గురైన, దెబ్బతిన్న సెల్‌ఫోన్లను అబిడ్స్‌లోని జగదీశ్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని తెలిపారు. దెబ్బతిన్న ఫోన్లను అక్కడే డిస్మెంట్ చేస్తున్నారన్నారు. ఓ వ్యక్తి జగదీశ్ మార్కెట్‌లో ఇలాంటి ఫోన్ల కోసం ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఏర్పాటు చేశాడన్నారు. దొంగిలించిన సెల్‌ఫోన్లను సముద్ర మార్గం ద్వారా సూడాన్ తరలిస్తున్నారని, విమానాశ్రయాల్లో అయితే నిఘా ఎక్కువగా ఉంటుందని, పడవల్లో వాటిని తీసుకెళ్తున్నారని వివరించారు.