పురుడు పోసుకుంటున్న అస్తిత్వ పోరాటం

ఓరుగ‌ల్లులో మ‌ళ్లీ అస్తిత్వ‌ పోరాటం పురుడుపోసుకుంటోంది.

Update: 2024-08-20 00:31 GMT

ఓరుగ‌ల్లులో మ‌ళ్లీ అస్తిత్వ‌ పోరాటం పురుడుపోసుకుంటోంది. అశాస్త్రీయంగా జ‌రిగిన వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణం విభ‌జ‌న‌పై పోరుగ‌ల్లులో స‌మాలోచ‌న‌లు పోరాటం రూపం దాల్చుతున్నాయి. మేధావి వ‌ర్గంలో మొద‌లైన‌ సంఘ‌ర్ష‌ణ స‌మాజ బ‌హుళ్యంలోకి తీసుకెళ్లేందుకు.. ఉద్య‌మం లేవ‌నెత్తేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయి. చారిత్ర‌క ఓరుగ‌ల్లు ట్రైసిటీని వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లాలుగా విడ‌గొట్ట‌డాన్ని జ‌నం ఇముడ్చుకోలేక‌పోతున్నారు. ప‌రిపాల‌న సౌల‌భ్యానికి కొత్త జిల్లాల ఏర్పాటు ఆవ‌శ్య‌క‌త‌ను గుర్తిస్తూనే.. అశాస్త్రీయంగా, అసంబ‌ద్ధంగా జ‌రిగిన పున‌ర్విభ‌జ‌న‌పై మొద‌ట్నుంచి జ‌నం నుంచి విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతూనే వ‌చ్చాయి.

జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌కు ఖ‌చ్చిత‌మైన ప్రాతిప‌దికంటూ ఏదీ అవ‌ల‌భించ‌కుండా.. తోచిన‌ట్లుగా ముక్క‌లు ముక్క‌లుగా చేసేశారు. అంతా రాజ‌కీయ కోణ‌మే రాజ్య‌మేలింది. నేత‌ల రాజ‌కీయ‌ స్వార్థ‌పూరిత‌ సిఫార్సుల‌తోనే విభ‌జ‌నలు జ‌రిగిపోయాయి. భౌగోళిక స్వ‌రూపాలు, ప్ర‌జ‌ల అభిమ‌తం, అభిప్రాయాల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోలేద‌న్న‌ది ముమ్మాటికి వాస్త‌వం. ముఖ్యంగా వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లాల‌ను ఇష్టారీతిన విభ‌జించేశారు. వ‌రంగ‌ల్ విష‌యంలో కేసీఆర్ చారిత్ర‌క త‌ప్పిదం చేశార‌ని అన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ ప‌ట్ట‌ణాల‌ను ఒకే జిల్లాగా ఉంచాలంటూ ఓ ఉద్య‌మం పురుడు పోసుకుంటుండ‌టం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌యం.

వ‌రంగ‌ల్ విష‌యంలో దురుద్దేశ‌మే..!

ఓరుగ‌ల్లు ప్ర‌జ‌లెవ‌రు కోరుకోని వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లాల విభ‌జ‌న ఎందుకు చేసిన‌ట్టు..? నిజంగానే ప‌రిపాల‌న ప‌ర‌మైన సౌల‌భ్యం కోస‌మే అయితే హైద‌రాబాద్‌కు లేని ఇబ్బంది వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణానికే ఎందుకు వ‌చ్చింది..? ప్ర‌జ‌లు, విద్యావంతులు, మేధావుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చినా ప‌ని గ‌ట్టుకుని వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణాన్ని రెండు జిల్లాలు ముక్క‌లు చేశారెందుకు..? ఎవ‌రు అడ‌గ‌ని డిమాండ్‌ను ఎందుకు అమ‌లు చేసిన‌ట్టు..? ఇది రాజ‌కీయ‌ కుట్ర కాదా..? వ‌రంగ‌ల్ అస్తిత్వాన్ని దెబ్బ‌తీయ‌డం కాదా..? వ‌రంగ‌ల్‌ను ముక్క‌లు చేసి ఉద్య‌మాల‌ను, ప్ర‌శ్నించే గ‌ళాల‌ను చింద‌ర వంద‌ర చేసే దురుద్దేశం ఇందులో లేదా..? అన్న ప్రశ్న‌లకు స‌మాధానం చెప్ప‌క్క‌ర్లేదు అన్న‌ట్లుగా నాటి సీఎం కేసీఆర్ మొండివైఖ‌రితో ముందుకెళ్లారు.

మ‌ళ్లీ హ‌న్మ‌కొండ‌, వ‌రంగ‌ల్ ఏకీక‌ర‌ణ ఉద్య‌మం

మ‌ళ్లీ వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ ప‌ట్ట‌ణాల‌ను ఒక్క జిల్లాగానే ఉంచాల‌నే డిమాండ్ పురుడు పోసుకుంటోంది. ప్ర‌శ్నించడం, ఎదురించ‌డం, దిక్క‌రించ‌డం ఓరుగ‌ల్లు జ‌నంలో ఇమిడి ఉన్న స్వ‌భావం. ప్ర‌శ్నించ‌డం, పోరాటం అన్న‌ది ఓరుగ‌ల్లు జ‌నాల్లో ఉండే దృక్ప‌థం. వంద‌ల ఏళ్ల నాటి నుంచి నిరూపిత‌మ‌వుతూ వ‌స్తున్న నిజం. కాక‌తీయుల‌ను ఎదురించిన స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌లు మొద‌లు.. తెలంగాణ ఉద్య‌మంలో న‌మ‌స్తేకు బ‌దులుగా జై తెలంగాణ అంటూ ప‌ల‌క‌రించుకుంటూ ఉద్య‌మ స్ఫూర్తిని ప్ర‌క‌టించుకుంటూ ముందుకు సాగారు ఇక్క‌డి జ‌నాలు.

తెలంగాణ రాష్ట్ర క‌ల సాధ‌న‌కు ఎంతో మంది గొప్ప నాయ‌కుల‌ను, మేధావుల‌ను ఈ నేల త‌యారు చేసింది. అనేక మంది క‌వులు, క‌ళాకారులు, ర‌చ‌యిత‌లు,మేధావులు త‌మ శ్ర‌మ‌ను ధార‌పోసి ఉద్య‌మాన్ని నిల‌బెట్టారు. ఉద్య‌మాన్ని ఉవ్వెత్తున ఎగిసిప‌డేలా, నిర్మాణాత్మ‌క‌మైన పోరు స‌డిపిలే కృషి చేశారు. ఉద్య‌మ నాయ‌కుడి నుంచి ప్ర‌భుత్వాధినేత‌గా, ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ నేత‌గా రూపాంత‌రం చెందిన కేసీఆర్‌కు బ‌హుశా వ‌రంగ‌ల్‌తో ప్ర‌మాదం పొంచి ఉంటుంద‌ని భావించి ఉండ‌వ‌చ్చ‌న్న అభిప్రాయం జ‌నాల్లో ఉంది. అందుకే వ‌రంగ‌ల్ అర్బన్‌, వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలుగా, త‌ర్వాత వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లాలుగా ట్రైసిటీని విడ‌గొట్టేశార‌న్న వాద‌న స్ప‌ష్టంగా వినిపిస్తోంది. వ‌రంగ‌ల్ విష‌యంలో కేసీఆర్ చారిత్ర‌క త‌ప్పిదం చేశార‌ని అన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ ప‌ట్ట‌ణాల‌ను ఒకే జిల్లాగా ఉంచాలంటూ ఓ ఉద్య‌మం పురుడు పోసుకుంటుండ‌టం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌యం.









అరెల్లి కిర‌ణ్‌

జ‌ర్న‌లిస్ట్

73966 04266


Similar News