ఇప్పుడున్న స్పీడ్ సరిపోదు.. పార్టీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం
రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం తమకు అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని డిసైడ్ అయింది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం తమకు అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని డిసైడ్ అయింది. అందుకే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తాను ఎన్నిసార్లయినా ఇక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. విమోచన వేడుకల అనంతరం అమిత్ షా బీజేపీ ముఖ్య నేతలతో బేగంపేట హరిత ప్లాజాలో భేటీ అయ్యారు. ఈ కోర్ కమిటీ మీటింగ్ హాట్ హాట్‌గా జరిగినట్లు తెలుస్తోంది. గంటన్నర పాటు జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కొద్ది దూరంలోనే ఉన్నామని ఇంకొంత పోరాడితే అధికారంలోకి రావొచ్చని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. మునుగోడు టార్గెట్‌గా ఈ భేటీలో నిర్ణయించారు.
తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టినప్పటి నుంచి వరుసగా జాతీయ నేతల రాకపోకలు పెరిగాయి. అంతేకాకుండా ప్రజలకు చేరువయ్యేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. పార్లమెంట్ ప్రవాస్ యోజన, ప్రజా గోస బీజేపీ-భరోసా, బైక్ ర్యాలీలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర, కేంద్ర మంత్రుల పర్యటనలు, జాతీయ స్థాయి నేతల సభలు, సమావేశాలపై ఈ భేటీలో కీలక చర్చ జరిగినట్లు టాక్. బీజేపీ పుంజుకునేందుకు కావాల్సిన అన్ని అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు శ్రేణులు చెబుతున్నాయి. గతంలో బీజేపీ గ్రాఫ్, ఇప్పుడున్న కాషాయ పార్టీ గ్రాఫ్ ఎంత మేరకు మెరుగైంది అనే అంశం సైతం అమిత్ షా దృష్టికి నేతలు తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో బీజేపీ నేతలు చేపడుతున్న కార్యక్రమాలపై సంతోషం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పోరాట పటిమపై ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ మొదటి విడుత పాదయాత్ర మొదలు ఇప్పటి వరకు వచ్చిన స్పందనపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తనతో పాటు కేంద్ర మంత్రుల, జాతీయ స్థాయి నేతల పర్యటనలు నిత్యం కొనసాగుతూనే ఉంటాయని చెప్పినట్లు తెలుస్తోంది. జాతీయ నాయకత్వం అంచనాలను అందుకోవాలంటే మరింత కష్టపడాలని నేతలకు షా దిశానిర్దేశం చేశారు. పార్టీలో ఐక్యత కొరవడటంపై నేతలకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ప్రజల్లో బీజేపీపై ఆసక్తి ఉన్నప్పటికీ.. నాయకులు ఇంకా కష్టపడితేనే ఫలితముంటుందని షా నిర్దేశించినట్లు టాక్. బండి సంజయ్ పాదయాత్రకు స్పందన బాగుందని.. మిగతా నేతలు సైతం ప్రజల్లో ఉండాలని సూచించినట్లు చెబుతున్నారు.
కమలనాథులు చేపడుతున్న వరుస కార్యక్రమాలు, ప్రజలకు చేరువయ్యే తీరుపై హర్షం వ్యక్తంచేసిన అమిత్ షా అధికారంలోకి వచ్చేందుకు ఈ స్పీడ్ సరిపోదని దిశానిర్దేశం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పుడిప్పుడే ప్రజలకు చేరువవుతున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో మరింత చొచ్చుకుపోవాలని, అందుకు ఈ స్పీడ్ చాలదని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అధికారం కావాలంటే మరింత స్పీడ్ పెంచాల్సిన సమయమిదేనని నేతలకు దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడాలంటే నేతలంతా సమన్వయంతో ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచనలు చేశారని టాక్. సొంత ఇమేజ్ పై దృష్టి పెట్టకుండా పార్టీ కార్యక్రమాల్లో అందరూ చురుకుగా పాల్గొని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతమైపోయిందని, దేశ వ్యాప్తంగా కూడా ఆ పార్టీ తీరు అంతంతమాత్రంగానే ఉన్నట్లు షా నేతలకు చెప్పినట్లు సమాచారం. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నేతలు సక్సెస్ కావాలని సూచనలు చేసినట్లు చెబుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో విజయంతో భవిష్యత్‌లో వచ్చే సాదారణ ఎన్నికలకు రాచమార్గం వేసుకునేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని షా నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ బైపోల్‌లో గెలుపే వచ్చే ఎన్నికల్లో పార్టీకి మరింత లైన్ క్లియర్ చేస్తుందని ఆయన చెప్పారు. మునుగోడులో కమిటీలను రెండ్రోజుల్లోగా పూర్తిచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ నియోజకవర్గంలో మొత్తం 189 గ్రామాలుండగా ప్రతి గ్రామానికి ముగ్గురితో ప్రత్యేక కమిటీ రూపొందించాలని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. కమిటీలో ఒకరు గ్రామానికి చెందిన నేతగా ఉండాలని, మరొకరు ఫుల్ టైమర్‌గా, మూడో వ్యక్తి రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసుకునేలా ప్రత్యేక కమిటీని రూపొందించాలని సూచించారు. వీరు ప్రజలను, నేతలను సమన్వయం చేసుకుంటూ గెలుపునకు బాటలు వేయాలని సూచనలు చేశారు. మునగోడు బైపోల్‌లో ఎవరూ ఊహించిన ఫినిషింగ్‌ను ఇవ్వాలని నేతలకు షా నిర్దేశించారని శ్రేణులు చెబుతున్నాయి. అధికార టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత దూకుడుగా వెళ్ళాలని అమిత్ షా సూచనలు చేసినట్లు శ్రేణులు చెబుతున్నాయి.
అమిత్ షా తో ముఖ్య నేతల భేటీ అనంతరం పలువురు నేతలతో రాజగోపాల్ రెడ్డి విడివిడిగా సమావేశమయ్యారు. తరుణ్ చుగ్, సునిల్ బన్సల్, విజయశాంతి, డీకే అరుణతో మునుగోడుపై ఏం చేద్దామని సమాలోచనలు చేశారు. తరుణ్ చుగ్, బన్సల్‌తో రాజగోపాలరెడ్డి 20 నిమిషాల రహస్యంగా చర్చలు జరిపారు. ఇంకెలాంటి వ్యూహాలు రచించాలో సూచనలు తీసుకున్నట్లు టాక్. మునుగోడును గెలిచి తీరాలని అమిత్ షా ఆదేశించిన ప్రకారం సరికొత్త వ్యూహాలకు పదును పెట్టనున్నట్లు తెలుస్తోంది.